ప్రయాణికులకు షాక్.. మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంపు

by Sathputhe Rajesh |   ( Updated:2022-04-08 14:16:43.0  )
ప్రయాణికులకు షాక్.. మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: డీజిల్ ధర పెంపు కారణంగా తెలంగాణ ఆర్టీసీ కొత్తగా 'డీజిల్ సెస్' విధించింది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఇది అమల్లోకి రానున్నది. పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ బస్సుల్లో ప్రతీ టికెట్‌పై రూ. 2 చొప్పున ఇక నుంచి అదనంగా వసూలు చేయనున్నది. ఎక్స్ ప్రెస్, సూపర్ లగ్జరీ, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, ఎయిర్ కండిషన్ బస్సుల్లో రూ. 5 చొప్పున వసూలు చేయనున్నది. గతేడాది డిసెంబరులో లీటర్ డీజిల్ ధర రూ. 83గా ఉండేదని, ఇప్పుడు బల్క్ పద్ధతిలో కొనుగోలు చేస్తే రూ. 118కి పెరిగిందని, ఒక్కో లీటర్‌పై రూ. 35 చొప్పున పెరగడం సంస్థకు ఆర్థిక భారంగా మారిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్, చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చాలా కాలంగా ఛార్జీలను పెంచకుండా సంస్థను నిర్వహించాలనుకున్నామని, కానీ గత కొన్ని రోజులుగా పెరుగుతుండడంతో ఇప్పుడు డీజిల్ సెస్ విధించక తప్పడం లేదని పేర్కొన్నారు.

పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో మినిమమ్ ఛార్జీగా ఉన్న టికెట్ ధర యధావిధిగా రూ. 10 చొప్పున కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇటీవలే పల్లెవెలుగు, మరికొన్ని కేటగిరీల బస్సుల్లో చిల్లర సమస్య కారణంగా రౌండప్ పేరుతో ఛార్జీల సవరణ చేసి కొంత మేర అదనపు వడ్డింపులు చేసింది. ఇప్పుడు డీజిల్ సెస్ పేరుతో మరో రూపంలో వసూలు చేయనున్నది. రోజుకు సగటున ఆరు లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్న ఆర్టీసీ వివిధ రకాల బస్సు సర్వీసుల్లో సెస్ పేరుతో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నది. డీజిల్ ధరల పెంపు ఇప్పటికే సరుకు రవాణా చార్జీలు పెరిగాయి. ఆటో, క్యాబ్ చార్జీలూ అనధికారికంగా పెరిగాయి. వేసవి ప్రయాణంలో ఏసీ వాడాలనుకుంటే అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. నిత్యావసర వస్తువుల ధరలూ పెరిగాయి. వీటన్నింటికి తోడు ఇప్పుడు ఆర్టీసీ కూడా ఛార్జీలను పెంచి సామాన్యులపై భారం వేసింది.

Advertisement

Next Story