‘ధరణిలో చెరువులే మాయం’..కబ్జాదారులకు సహకరిస్తున్న అధికారులు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-10 02:20:47.0  )
‘ధరణిలో చెరువులే మాయం’..కబ్జాదారులకు సహకరిస్తున్న అధికారులు
X

దిశ ప్రతినిధి,నిజామాబాద్:ఒకప్పుడు రైతులు పండించే పంటలకు సాగు నీటినే కాకుండా, ప్రజల దాహార్తిని తీర్చేందుకు తాగునీటిని కూడా అందించిన గ్రామీణ నీటి వనరులు చెరువులు, కుంటలు. అలాంటి చెరువులు, కుంటల శిఖం భూములను కబ్జాదారులు ఆక్రమించుకుంటున్నారు. శిఖం భూముల్లో ఇళ్లు నిర్మించుకోవడం, వెంచర్లు వేసి వ్యాపారం చేసుకోవడం, పంట పొలాలు పండిస్తూ వ్యవసాయం చేయడం వంటివి చేస్తున్నారు. రెవెన్యూ భూములను కాపాడాల్సిన సంబంధిత అధికారులే ముడుపుల మత్తులో కబ్జాదారులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరెన్సీ కట్టలకు అమ్ముడు పోయి శిఖం భూములను ధారాదత్తం చేస్తున్నారు. కబ్జారాయుళ్లకు కట్టబెడుతున్నారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలోని నాలుగు ప్రధాన చెరువులున్నాయి. వీటిలో మూడు చెరువులకు సంబంధించిన సర్వే నెంబర్లను ధరణిలో మాయం చేశారు. ధరణి పోర్టల్‌లోని ల్యాండ్ సెర్చ్ డిటేయిల్స్‌లో సర్వే నెంబర్ వారీగా వివరాలు తెలుసుకోవడానికి వివరాలు ఎంటర్ చేస్తే చెరువులు, కుంటలకు సంబంధించిన సర్వే నెంబర్లు కనిపించడం లేదు. దీంతో భూమి విస్తీర్ణం, మ్యాప్ వంటి వివరాలను కనుక్కునే అవకాశం లేకుండా పోయింది. పోర్టల్‌లో చెరువులు, కుంటల సర్వే నెంబర్లను అధికారులు మాయం చేశారు.

ధరణి పోర్టల్‌లో చెరువులు కుంటలు మాయం చేసింది రెవెన్యూ అధికారులే. పట్టణంలోని ధర్మ రాయుడు కుంట, రామన్న కుంట, మొగిలి చెరువులకు సంబంధించిన సర్వే నెంబర్ల వారీగా ధరణి పోర్టల్‌లో ఆయా చెరువులు, కుంటల భూరికార్డులు, వివరాలేవీ కనిపించకుండా అధికారులు మాయం చేశారు. ధరణి పోర్టల్‌లో యాధృచ్ఛికంగా భూవివరాలు మాయమయ్యాయా..రెవెన్యూ సిబ్బందే ఉద్దేశపూర్వకంగా భూరికార్డుల వివరాలు మాయం చేశారా అనేది ఉన్నతాధికారులు తేల్చాల్సిన అవసరముంది. అధికారులే మాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. భీమ్‌గల్ పట్టణ శివారులోని కుప్కల్ బైపాస్ రోడ్డులో సర్వే నెంబర్ 544లో 41 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో విస్తరించి ఉన్న మొగిలి చెరువు ధరణిలో మాయం చేశారు.

దీని వివరాలు ధరణిలో లేవు. ఈ సర్వే నెంబర్ కన్నా ముందు, వెనకాల ఉన్న సర్వేనెంబర్ వివరాలన్నీ ధరణిలో నమోదై ఉన్న ప్పటికీ మొగిలి చెరువు శిఖం కు సంబంధించిన సర్వేనెంబర్ 544 ఒక్కటి మాత్రం ధరణిలో కనిపించకపోవడం గమనార్హం. అలాగే సర్వే నెంబర్ 426 లో ఉన్న ధర్మ రాయుడి కుంట, సర్వే నెంబర్ 1256లో ఉన్న రామన్న కుంట వివరాలేవీ ధరణిలో నమోదు కాలేదు. ఈ రెండు కుంటలకు సంబంధించిన సర్వే నెంబర్లకు వెనకా ముందున్న సర్వే నెంబర్లు ధరణి రికార్డుల్లో ఉన్నప్పటికీ, ఈ కుంటలకు సంబంధించిన వివరాలు మాత్రమే ధరణిలో నమోదు కాకపోవడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, ధర్మరాయుడి కుంట అనేది ప్రస్తుతం అక్కడ ఆనవాళ్లు కూడా లేకుండా కబ్జాలకు గురయ్యింది. కుంటకు సంబంధించిన తూముకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. కుంటను పూర్తిగా ఆక్రమించేసి రైతులు వ్యవసాయ పంటలు పండిస్తున్నారు. ఇకపోతే బెజ్జోర రోడ్డును ఆనుకుని ఉన్న రామన్న కుంట కూడా దాదాపు సగానికి పైగా కబ్జాలకు గురైంది. రైతులు సగానికి పైగా విస్తీర్ణంలో శిఖం భూమిని సాగుచేసుకుని పంటలు పండిస్తున్నారు. రాతం చెరువు వివరాలు మాత్రమే ధరణిలో పొందుపరచబడి ఉన్నాయి. సర్వేనెంబర్ 27లో 73. 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రాతం చెరువుకు సంబంధించిన వివరాలు మాత్రమే ధరణిలో నమోదై ఉన్నాయి.

కబ్జాలకు అడ్డాలు..

నిజాం కాలంలో తవ్వించి నిర్మించిన చెరువులు, కుంటలు నాటి నుండి ప్రజలకు తాగు, సాగునీటి వనరులుగా ఉపయోగపడుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో ఆయా భూములను గుర్తించడానికి వాటికి సర్వే నెంబర్లు, బై నెంబర్లు ఇవ్వడం, ఆ సర్వే నెంబర్ ద్వారానే ఏ భూమి ఎవరిదో, ఏ భూమి ఎక్కడుందో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉందోననే కచ్చితమైన హద్దుల ద్వారా తెలిసేది. భూముల గుర్తింపులో ఆయా సర్వే నెంబర్లే ప్రామాణికంగా ఉపయోగ పడతాయి. ఇప్పుడున్న రెవెన్యూ రికార్డుల్లో, నిజాం కాలం నాటి రికార్డుల్లో సైతం కచ్చితమైన హద్దులు, కొలతలు కలిగిన మ్యాపులు ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా రెవెన్యూ రికార్డులు బాగానే ఉండేవి. రాను రాను రికార్డులన్నీ తారుమారయ్యాయి. రికార్డుల తారుమారులో ఒక చోట ఉన్న భూమి వివరాలను మరో చోట ఉన్నట్లు సర్వే నెంబర్లను మార్చేశారు. కాసుల కక్కుర్తితో ఇలాంటి పనులు కొందరు రెవెన్యూ అధికారులు, కింది స్థాయి సిబ్బందితో కలిసి చేశారు. రాజకీయంగా పలుకుబడి ఉన్న కొందరు వ్యక్తులు, నాయకులు, అధికారులతో కలిసి అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా రెవెన్యూ భూములు, శిఖం భూముల కబ్జాలకు తెగబడ్డారు. దీంతో భూములకు సంబంధించిన వివాదాలు ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యల్లా రావణకాష్టంలా ఇప్పటికీ మండుతూనే ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed