హైదరాబాద్‌లో ఇక ఆ మ్యూజియం : KTR

by Sathputhe Rajesh |
హైదరాబాద్‌లో ఇక ఆ మ్యూజియం : KTR
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లో చేనేత మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. బీఆర్‌కేఆర్ భవన్‌లో శుక్రవారం టెక్స్‌టైల్ శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. టెక్స్టైల్ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలు, వాటి అమలు తీరుపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నేతన్నలకు అందిస్తున్న చేనేత మిత్ర లాంటి కార్యక్రమాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గుండ్ల పోచంపల్లి అప్పారెల్ పార్క్, గద్వాల్ హ్యాండ్లూమ్ పార్క్ కార్యక్రమాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పనిచేస్తుందన్నారు. నేతన్నలకు సులువుగా ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా అధికారులు కార్యాచరణ కొనసాగించాలన్నారు. నేతన్నల సూచనల మేరకు పథకాల్లో చేయాలని సూచించారు. రాష్ట్రంలో మినీ టెక్స్టైల్ పార్కులు, టెక్స్టైల్ పార్కులు, ఆప్పారెల్ పార్కుల అభివృద్ధిని చేపట్టామన్నారు. ఆయా పార్కుల్లో ఇంకా మిగిలిపోయిన పనులు ఉంటే వెంటనే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బ్లాక్ లెవెల్ క్లస్టర్ల పనితీరుపైన, వాటి పురోగతి పైన ఒక నివేదికను వెంటనే తయారుచేసి అందజేయాలని ఆదేశించారు.

చేనేత రంగంలోని నేతన్నల కళకు, వృత్తికి మరింత ఆదాయం వచ్చేలా తీసుకోవాల్సిన కార్యక్రమాలపైన అధ్యాయనం చేయాలని అధికారులను కోరారు. నారాయణపేట, గద్వాల్, దుబ్బాక, కొడకండ్ల, మహాదేవపూర్, కొత్తకోట వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమైన పనులపైన అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆగస్టు 7న నిర్వహించే జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, ఆ రంగంలోని అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్న నేతన్నలకు గుర్తింపునిచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

పవర్లూమ్ రంగం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దేశంలోనే ఆదర్శంగా ఉన్న తమిళనాడులోని తిర్పూర్ క్లస్టర్ మాదిరిగా ఒక సమీకృత పద్ధతిన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన పవర్లూమ్ క్లస్టర్లను తెలంగాణలో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. తిర్పూర్ క్లస్టర్ లో పర్యటించి అక్కడ ఉన్న ఆదర్శవంతమైన పద్ధతులను పరిశీలించాలన్నారు.

అక్కడి నేతన్నలు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంచుకున్న తీరు, వారు అనుసరిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ), జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా చేస్తున్న నేత ఉత్పత్తుల తయారీ వంటి అనేక అంశాల పైన విస్తృతంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. తిర్పూర్ లాంటి పవర్లూమ్ క్లస్టర్ల స్ఫూర్తితో తెలంగాణలోనూ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను వెంటనే ప్రతిపాదించాలని టెక్స్టైల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈసమావేశంలో చేనేత మరియు పవర్లూమ్ కార్పొరేషన్ల చైర్మన్లు ఎల్. రమణ, గూడురి ప్రవీణ్ , టెక్స్టైల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed