పసుపు బోర్డు ప్రకటన సరే..బోర్డు ఏర్పాటు ఎక్కడ?

by Sridhar Babu |
పసుపు బోర్డు ప్రకటన సరే..బోర్డు ఏర్పాటు ఎక్కడ?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కేవలం ప్రకటనకే పరిమితమైందని.. దానిని ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో మరోమారు పసుపు రైతులను బీజేపీ మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తుందని, ఎంపీ అరవింద్ మాటలను నమ్మవద్దని సూచించారు. బుధవారం జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసి ఆరు నెలలు గడిచిందని, ఇప్పటివరకు ఎలాంటి కార్యకలాపాలు మొదలు కాలేదన్నారు.

అధికారికంగా బోర్డు ఏర్పాటు కాలేదని గుర్తు చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 85వేల ఎకరాల్లో పసుపు సాగయ్యేదని, ప్రస్తుతం కేవలం 35 వేలకు తగ్గిందని చెప్పారు. సాగు విస్తీర్ణం తగ్గడంతోనే ధర పెరిగిందని, ఇందులో బీజేపీ కానీ ఎంపీ అర్వింద్‌ కానీ చేసిన కృషి ఏమీలేదని ఆయన పేర్కొన్నారు. రైతులను మోసం చేసేందుకే పసుపు ధరను ప్రకటిస్తున్నారని, బీజేపీ మాయమాటలను నమ్మవద్దని రైతులకు సూచించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రైతులకు మద్దతు ధరపై ఎందుకు చట్టం చేయలేదని ప్రశ్నించారు.

దేశంలో రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు. రైతులకు వ్యతిరేకంగా తయారుచేసిన నల్ల చట్టాలను దేశంలో రైతులు వ్యతిరేకించడంతో వెనక్కి తీసుకున్న ఘనత ఒక్క బీజేపీకే దక్కిందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని అన్నారు. ఎంపీ అరవింద్ తన ఐదేళ్ల పదవి కాలంలో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహెర్ బీన్ హాందన్, జిల్లా కిసాన్ కేతు ఆధ్యక్షులు ముప్పగంగారెడ్డి, సీనియర్ నాయకులు మునిపల్లి సాయి రెడ్డి, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed