అంగన్వాడీ సమస్యల పై ఎమ్మెల్యే ఇంటి ముందు వర్కర్ల ధర్నా..

by Sumithra |
అంగన్వాడీ సమస్యల పై ఎమ్మెల్యే ఇంటి ముందు వర్కర్ల ధర్నా..
X

దిశ, నిజామాబాద్ ప్రతినిధి : 65 ఏళ్లు నిండిన అంగన్వాడీ వర్కర్లకు అతి తక్కువ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తూ ఇంటికి పంపేలా తెచ్చిన జీవో నెం.10 ని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంగన్వాడీ వర్కర్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. అంతకు ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు గాంధీ చౌక్ నుంచి ఎమ్మెల్యే ఇంటి వరకు ర్యాలీగా వెళ్లి ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, జిల్లా కార్యదర్శి పి.స్వర్ణలు మాట్లాడుతూ అంగన్వాడి ఉద్యోగుల సమస్యలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలన్నారు. 2023 సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 4 వరకు రాష్ట్రంలో 24 రోజులు నిరవధిక సమ్మె చేసినప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రూ. 2 లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచుతామని, పెన్షన్ వీఆర్ఎస్ సౌకర్యం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చిందని వారు గుర్తు చేశారు.

అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మంత్రి సీతక్కకు, ఉన్నతాధికారులకు పలుమార్లు మొర పెట్టుకున్నామన్నారు. గత ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏకపక్షంగా వర్కర్లు, హెల్పర్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా జీవో 10ని అమలు చేయాలని సర్కులర్ జారీ చేయడం దుర్మార్గమైన చర్య అని వారన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణకు వినతిపత్రం ఇచ్చి జీఓ 10 ను రద్దు చేయించాలని కోరారు. ఈనెల 24 నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీ సమస్యలను లేవనెత్తుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీ ముందు అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు నాయకులు సూర్య కళ, రాజ్యలక్ష్మి, సరిత, జారిన, లలిత, సునీత, సునంద, లక్ష్మీ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story