MLA Sudarshan Reddy : ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి

by Kalyani |
MLA Sudarshan Reddy : ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి
X

దిశ, నవీపేట్: రాష్ట్రంలో రైతులు, మహిళలతో పాటుగా అన్ని సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని రఘుపతి రెడ్డి గార్డెన్స్ లో శనివారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ, అధికారులతో, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో గల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం దిశా నిర్దేశం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలని, ఉత్తీర్ణత శాతం పెంచి పోటీ పరీక్షలలో ప్రైవేట్ విద్యార్థులకు ధీటుగా ర్యాంకులు వచ్చేలా కృషి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం 82 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తుందని అందులో భాగంగానే రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.

రెండు లక్ష రూపాయల రుణమాఫీ ఆగస్టు 15 వరకు పూర్తిగా మాఫీ చేయడం జరుగుతుందని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు. రుణమాఫీ పొందని రైతులు సంబంధిత అధికారులకు సంప్రదించాలని అన్నారు. అలాగే అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని అన్నారు. అధికారులు అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్, జిల్లా రెవెన్యూ అధికారి రాజేంద్ర కుమార్, ఎమ్మార్వో నారాయణ, ఎంపీడీవో నాగనాథ్, ఉర్దూ మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీలు రాజేందర్ కుమార్ గౌడ్, సంగెం శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధికారులు ప్రధానోపాధ్యాయులు, లబ్ధిదారులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story