స్త్రీ లేకుంటే ప్రపంచమే లేదు

by Sridhar Babu |
స్త్రీ లేకుంటే ప్రపంచమే లేదు
X

దిశ, బాన్సువాడ : స్త్రీ లేకుంటే ప్రపంచమే లేదని, ఎవరైనా కన్నతల్లి బిడ్డలమేనని మాజీ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన 118 మందికి కళ్యాణలక్ష్మీ చెక్కులను బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఆయన ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆడబిడ్డ ఇంటికి మహాలక్ష్మీ అని, కూతురు అయినా కోడలు అయినా ఇద్దరు సమానమేనని అన్నారు.

తల్లి ఆరోగ్యంగా ఉంటే బిడ్డలు ఆరోగ్యంగా బాగుంటారని, గత సెప్టెంబర్ వరకు బాన్సువాడ నియోజకవర్గంలో కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకం ద్వారా 15,000 మందికి రూ.130 కోట్ల రూపాయల నిధులు ఇచ్చామన్నారు. తల్లి ఆరోగ్యం కోసం అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం పెడ్తున్నారని, గర్భవతులు, పిల్లల కోసం బాన్సువాడ లో రూ. 20 కోట్లతో 100 పడకలతో మాతా-శిశు ఆసుపత్రి నిర్మించామన్నారు. నెలలు నిండకముందే పుట్టిన శిశువుల కోసం ప్రత్యేకంగా ఎస్​ఎన్​సీయు వార్డు ఏర్పాటు చేశామని, ఆసుపత్రిలో పేషెంట్ల కోసం బలవర్ధకమైన ఆహారం పెడుతున్నామని, సహాయకుల కోసం ప్రత్యేకంగా షెడ్ నిర్మించామన్నారు. అవసరమైన వారికోసం అందుబాటులో ఉండడానికి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయించానన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story