బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది: ఎంపీ ఈటల

by Naveena |
బీఆర్ఎస్ పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది: ఎంపీ ఈటల
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పనులకు పాల్పడుతోందని ఎంపీ ఈటల అన్నారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే చేస్తే ప్రజలు బొంద పెట్టారని, అదే గతి కాంగ్రెస్ కు పడుతుందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీజేపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా.. శనివారం నిజామాబాద్ కు వచ్చిన ఎంపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కూడా పూర్తవకుండానే అప్పుడే ప్రజా వ్యతిరేకత మొదలైందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం ఘోరంగా దివాలా తీసిందని, పాఠశాలలు, కళాశాలల భవనాలకు కనీసం అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా ప్రజా వ్యతిరేక పనులు చేస్తే, ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని బొంద పెట్టారని ఈటల గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదే తరహా పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందని ఈటల హెచ్చరించారు. మూసీ అంశంలో తాము వ్యతిరేకం కాదని, అక్రమ కట్టడాలకు మాత్రం వ్యతిరేకమని ఈటల పేర్కొన్నారు. దానికి విధి విధానాలు కూడా ఖరారు చేయలేదన్నారు. వితంతువులకు రూ.4వేలు అందిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఈటల విమర్శించారు. గ్రూప్-1 విషయంలో ఇబ్బందులు కలిగించకుండా రాజ్యాంగబద్ధంగా వెళ్లాలని ప్రభుత్వానికి సూచించారు. జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తాత్కాలికంగా పరీక్షను వాయిదా వేసి సమస్యను పరిష్కరించాలని ఈటల ప్రభుత్వాన్ని కోరారు. అభ్యర్థులకు అండగా, సంఘీభావం తెలుపడానికి వెళ్లిన ఎంపీ బండి సంజయ్ ని అడ్డుకోవడం నియంతృత్వ వైఖరి అని, దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాము సభ్యత్వ నమోదు కోసం గ్రామాల్లోకి వెళితే అన్ని గ్రామాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు అనేక అంశాలపై వినతిపత్రాలు సమర్పిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. రైతు భరోసా అర్హులందరికీ ఇంకా దక్కలేదని ఈటల అన్నారు.

Advertisement

Next Story

Most Viewed