Loan waiver information : ఏవో, ఏఈవోల వద్ద రుణమాఫీ సమాచారం....

by Sumithra |
Loan waiver information : ఏవో, ఏఈవోల వద్ద రుణమాఫీ సమాచారం....
X

దిశ, ఆలూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పంటరుణాల మాఫీ ప్రక్రియలో రైతుల సందేహాలను నివృత్తి చేసే వ్యవస్థ లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రుణమాఫీ పొందిన రైతుల జాబితా తప్ప వ్యవసాయ శాఖ వద్ద మరే సమాచారం లేదు. రుణ మాఫీ అమలు ప్రక్రియలో తాజాగా వ్యవసాయశాఖను భాగస్వామిగా చేసిన ప్రభుత్వం... వ్యవసాయాధికారి (ఏవో), వ్యవసాయ విస్తీర్ణ అధికారి(ఏఈవో)లకు లాగిన్‌ ఇచ్చింది. రైతులు తమ క్లస్టర్‌ ఏఈవో లేదా మండల వ్యవసాయాధికారిని కలిసి ఆధార్‌ నంబర్‌ చెబితే రుణం మాఫీ అయ్యిందా ? లేదా? అనే వివరాలను మాత్రం అందించే ఏర్పాట్లు చేశారు. ఒక వేళ రుణం మాఫీ కాని పక్షంలో ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనే సమాచారం మాత్రం వ్యవసాయ శాఖ వద్ద లేదు. గతంలోనూ రుణమాఫీ కానివారి కోసం గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసినా అది పూర్తిస్థాయిలో పనిచేయక పోవడంతో అనేక మందికి అర్హత ఉన్నా, రుణమాఫీ ఫలాలు దక్కలేదు.

జిల్లాలో తొలి విడతలో రూ.లక్ష వరకు పంట రుణం మాఫీ చేయగా... 44,469 మందికి రూ.228 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండో విడతలో రూ.1.50లక్షల వరకు, చివరి దశలో రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, తొలి విడతలోనే రూ.లక్ష వరకు బకాయి ఉన్న అనేక మందికి పంట రుణాలు మాఫీకానట్లు తెలుస్తోంది. తమకు రూ.లక్ష లోపు రుణం ఉన్నా... జాబితాలో తమ పేర్లు లేవని కొంత మంది రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి, బ్యాంకులకు వెళ్లి ఫిర్యాదు చేసినా ఎక్కడ కూడా సరైన సమాధానం దొరకడం లేదు. బ్యాంకుల నుంచి ప్రభుత్వం నేరుగా రైతుల వివరాలు, వారి బాకీ సమాచారాన్ని మాత్రమే సేకరించింది. రేషన్‌ కార్డును ఒకే కుటుంబంలోని రైతులు లబ్ది పొందుతున్నారా లేదా అని ప్రామాణికంగా తీసుకున్నారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటే వారి కుటుంబం మొత్తానికి రూ.2 లక్షల వరకు మాఫీ వర్తించాలి. కానీ ఒక్కరే కుటుంబ సభ్యుని పేరు జాబితాలో రావడం ఇతరుల పేర్లు లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed