ఇదేం కార్యాలయం.. దుమ్ము కూడా దులుపుకోరా..? : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్

by Shiva |
ఇదేం కార్యాలయం.. దుమ్ము కూడా దులుపుకోరా..? : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
X

రాత్రివేళలో భిక్కనూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

దిశ భిక్కనూరు : కార్యాలయంలో దుమ్ము, రిజిస్ట్రేషన్ ఛాంబర్ లో గోడలపై చుట్టూ సిరా మరకలు.. మీ ఇళ్లయితే ఇలాగే ఉంచుతారా.. అంటూ ప్రభుత్వ విప్ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో భిక్కనూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఉన్న ప్రతి ఒక్క గదిని పరిశీలిస్తూ కార్యాలయం గదుల్లో ఉన్న దుమ్ము, ధూళిని చూసి ఆశ్చర్యపోయారు. నీ మెయింటెనెన్స్ నీట్ గా ఉంటదనుకున్నా.. అంటూ తహసీల్దార్ ప్రేమ్ కుమార్ ను ప్రశ్నించగా.. ఆయన నోటి వెంట సమాధానం రాలేదు.

నేను.. సోమవారం సాయంత్రం ఏడున్నర లోపు కార్యాలయానికి వస్తానంటూ.. ఆలోపు కార్యాలయంలో చెత్త, చెదారంతో నిండిపోయిన గదులను శుభ్రం చేయించాలని ఎమ్మెల్యే ఎమ్మార్వోను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ గదిని పరిశీలించగా.. ఆ గదికి ఉన్న తలుపు బలంగా గుద్దితే తప్ప తెర్చుకోకపోవడంతో ఇదేంటి.. కార్యాలయం పక్కనే వడ్రంగులుంటారు.. ఈ పని కూడా చేయించుకోలేకపోతే ఎలా అంటూ మండిపడ్డారు. ఆయన సుమారు గంట పాటు తహసీల్దార్ కార్యాలయంలోనే కూర్చున్నారు.

ఆ పాపం ఎవరిది..

తాత, ముత్తాతలు, కుటుంబ సభ్యులు అందరూ ఉండగా ఎకరాల కొద్ది భూమి ఆన్ లైన్ క్లెయిమ్ లకు ఎలా పోతుందని విప్ గంప గోవర్ధన్ ప్రశ్నించారు. ఒక్క ర్యాగట్లపల్లి గ్రామంలోనే 108 మంది రైతులు 99.15 ఎకరాల భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో అక్కడి రైతులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇందుకు పరిష్కారం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించగా.. చెక్ మెమో ప్రొసీడింగ్ ప్రకారం.. జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ వద్దకు వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా చూద్దామని తహసీల్దార్ ప్రేమ్ కుమార్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Next Story

Most Viewed