పేరుకే.. పెద్ద ఆసుపత్రి..

by Sumithra |
పేరుకే.. పెద్ద ఆసుపత్రి..
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పట్టణంలో ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పటికీ ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతుంది. ఓ వైపు రోగులకు ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతూ చేతులు దులుపుకుంటున్నాయి. కానీ ప్రభుత్వ ఆసుపత్రులలో సరైన సదుపాయాలు లేకపోవడంతో రోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటూ తమ ప్రాణాలను వదులుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి రోగి వస్తే వైద్యులు ప్రత్యేక వసతులు లేవు అంటూ జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వాసుపత్రి పై ఆశలు పెట్టుకొని, రోగులు గనుక వస్తే గతంలో పలువురు కవులు కళాకారులు రాసిన పాట ప్రకారం నేను రాను బిడ్డ సర్కారు దావఖానకు, పాటలాగా ప్రజల బ్రతుకులు కొట్టుమిట్టాడుతున్నాయి.

30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఎల్లారెడ్డి పట్టణంలో ఉన్నప్పటికీ ఆస్పత్రిలో సరిపోయినంత వైద్య సిబ్బంది లేకపోవడం, గమనార్హం. 30 పడకల ఆసుపత్రిలో 16 మంది వైద్యులు తప్పనిసరిగా ఉండవలసింది. కానీ 8 మంది వైద్యులు ఉండటం, అందులో నుండి ఇద్దరు వైద్యులు డిప్యూటేషన్ పై వెళ్లిపోవడంతో ఆరుగురు వైద్యులతో ఆసుపత్రిని కొనసాగిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కొరకు వచ్చే రోగులకు సరైన వైద్యం అందించకపోవడంలో ప్రభుత్వ ఆసుపత్రి విఫలం అవుతుంది. ప్రజలకు సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రుల వైపు రోగులు వెళ్లడం తమ ప్రాణాలను కాపాడుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ కొట్టుమిట్టాడుతున్నారు.

పాము కాటుతో పదిమంది మృతి..

ఎల్లారెడ్డి మండలంలోని పలు గ్రామాలకు చెందిన 20 మంది వ్యక్తులకు ఈ నెలలో పాము కాటు వేస్తే సుమారు 13 మంది వరకు వైద్యం అందక ప్రాణాలు వదిలారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక సదుపాయాలు లేకపోవడమే దీనికి కారణం అంటూ వైద్యులు పేర్కొంటున్నారు. పాము కాటుతో విషం రోగికి ఒళ్లంతా నిండిపోవడంతో ప్రత్యేక వసతులు లేకపోవడంతో ఆసుపత్రి వైద్యులు జిల్లా ఆసుపత్రి కామారెడ్డికి రెఫర్ చేయడం మార్గ మధ్యలోనే పాముకాటుకు మృతి చెందిన వ్యక్తుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అధికారులు కనీసం గమనించి ప్రభుత్వ ఆసుపత్రి ఎల్లారెడ్డిలో వర్షాకాలం నేపథ్యంలో పాముకాటుకు వచ్చే రోగులకు ప్రత్యేక వసతులు కల్పించి ప్రజల ప్రాణాలు కాపాడవలసిందిగా అధికారులను వేడుకుంటున్నారు ప్రజలు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిరోజూ ప్రజలు రద్దీగా ఉన్నప్పటికీ వైద్యులు లేక ఎంతో మంది ప్రైవేట్ ఆస్పత్రిల వైపు పరుగులు పెడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పేరిట మాటలకే పరిమితం కానీ ప్రజలకు అందించే, వైద్య సేవలో ఏమాత్రం సరిపోదు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు సాధారణ టాబ్లెట్లు అందిస్తూ ప్రజలను జోకొడుతూ పంపిస్తున్నారు. రోగులకు కావలసిన సదుపాయాలు మౌలిక వసతులు లేకుండా సరియగు సిబ్బంది లేకుండా ప్రభుత్వ ఆసుపత్రి ఉండటం చర్చనీయాంశంగా మారుతుంది. కనీసం ప్రజలకు కావలసిన సదుపాయాలను సమకూర్చాలని ప్రజలు నాయకులను అధికారులను వేడుకుంటున్నారు.

Next Story