పింఛన్ మంజూరు అయిందని చెప్పి చోరీ

by Sridhar Babu |   ( Updated:2023-12-02 15:17:57.0  )
పింఛన్ మంజూరు అయిందని చెప్పి చోరీ
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో గల పెర్కిట్ ఏరియాలోని మున్సిపల్ 4వ వార్డు పరిధిలో వృద్ధురాలైన సాహెబ్ గారి రాజు భాయికు పింఛన్ మంజూరు అయిందని మాయ మాటలు చెప్పి గుర్తు తెలియని యువకుడు బంగారం ఎత్తుకెళ్లిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వృద్ధురాలైన సాహెబ్ గారి రాజు భాయి ఇంటికి గుర్తు తెలియని యువకుడు వెళ్లి అమ్మ మీకు పింఛన్ మంజూరు అయిందని, మీ ఫొటో తీసుకోవాలని చెప్పాడు.

ఫొటోలో మీ శరీరం పై బంగారం ఉంటే మీరు ఉన్నవారుగా భావించి మీకు పింఛను రాదు అని మాయమాటలు చెప్పి, ఆ వృద్ధురాలి శరీరంపై గల తులం పడిగేలను, తులం గుండ్లను, అర తులం మేంచులను ఆమెతోనే తీయించి కింద ఒక పేపర్లో పెట్టించాడు. ఆమెను పింఛన్ కోసం ఫొటో తీస్తున్నట్లుగా నటించి పేపర్ లో పెట్టిన రెండున్నర తులాల బంగారు నగలను తీసుకొని పరారయ్యాడు. ఇదంతా జరుగుతుండగా ఆ వృద్ధురాలి కుమారుడు, పక్షవాతంతో మంచంలో పడున్న మహేందర్ అతని మాటలు నమ్మొద్దని చెబుతున్నా పట్టించుకోలేదు. విషయాన్ని ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు.

Next Story

Most Viewed