రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థి హత్య

by Sridhar Babu |
రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థి హత్య
X

దిశ, భిక్కనూరు : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి హత్య జరిగిందని, పరీక్షల సమయంలో విద్యార్థులు టెన్షన్ పడే విధంగా ఎనిమిది మంది విద్యార్థులపై హత్య కేసు నమోదు అయ్యిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల శివారులోని గెస్ట్ హౌస్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చిన్న గొడవ ఎనిమిది మంది విద్యార్థుల జీవితాలను ఆగం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడం, ఆ శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉండడం వలన ఏమాత్రం పట్టింపు లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, హాస్టల్ వార్డెన్ లేకపోవడం, నైట్ వాచ్మెన్ ను ఏర్పాటు చేయకపోవడం వలన బోధన్ లో, ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని తిప్పారం గ్రామానికి చెందిన హర్యాల వెంకట్ అనే విద్యార్థి హత్య జరిగిందని ఆరోపించారు.

సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడూ కేసీఆర్ పై ఏడుస్తూ రాజకీయం చేయడం తప్ప, మూడు నెలల్లో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. ఒక తల్లిగా బాధపడుతూ రెండు చేతులు జోడించి మొక్కుతున్నా... ఈ విషయంలో రాజకీయాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల చావులు చూశామని, మళ్లీ ఇప్పుడే చూస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులతో రివ్యూ నిర్వహించి, స్కూళ్లు కళాశాలల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆశ్రమ పాఠశాలలో పోలీస్ కానిస్టేబుల్ ను కానీ, నైట్ వాచ్ మెన్ ను కానీ నియమించాలని జిల్లా కలెక్టర్లను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. మృతి చెందిన విద్యార్థి తల్లికి పెన్షన్ ఇవ్వాలని, సోదరునికి ప్రభుత్వ ఉద్యోగం, మృతుని కుటుంబానికి 15 లక్షల ఎక్స్ గ్రేషియా, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రాంతీయ పార్టీలను దేశవ్యాప్తంగా లేకుండా చేసేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని, దీంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీని పెద్దన్నగా పిలవడం వలన ఆయన నిజ స్వరూపం, ఆర్ఎస్ఎస్ భావజాలు ఇప్పుడు బయటకు వచ్చాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ముమ్మాటికి ఒక్కటేనని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క రూపాయి కేటాయించకపోయినప్పటికీ నరేంద్ర మోడీని పెద్దన్న గా సంబోధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ మీద ఉన్న శ్రద్ధ, సమస్యలపై లేదని, కేవలం కేసీఆర్ ను మాటలు అనడానికే పనిచేస్తాడని మండిపడ్డారు. భువనగిరిలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఆందోళన చేస్తే అరెస్టు చేస్తారా..? ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వ మార్పు అంటూ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed