నా చావుకు కారణం సర్పంచే.. మాజీ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలే

by Ramesh Goud |   ( Updated:2024-01-20 07:37:09.0  )
నా చావుకు  కారణం సర్పంచే.. మాజీ ఎమ్మెల్యే కూడా పట్టించుకోలే
X

దిశ భిక్కనూరు: స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా, వ్యవసాయం చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న గ్రామ సర్పంచ్ తన చావుకు ప్రధాన కారణమని ఆరోపిస్తూ హోటల్ యజమాని ఒకరు సూసైడ్ నోట్ గ్రూపులో పెట్టి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని అంబర్పేట్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గ్రామానికి చెందిన పుట్ట బాల్ చంద్రం (38) గ్రామంలోని ప్రధాన చౌరస్తాలో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

సుమారు ఏడాది క్రితం గ్రామపంచాయతీ భవన నిర్మాణం కోసం తన స్థలాన్ని గ్రామ సర్పంచ్ సలీం ఆక్రమించుకున్నాడు. ఈ విషయమై అప్పటి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కలిసి పలుమార్లు తనకు జరిగిన అన్యాయాన్ని విన్నవించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. తన స్థలంలో వేసుకున్న కంచెను కూడా రాత్రికి రాత్రికి తొలగించారని సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. కొత్త కుంట గ్రామంలోని కొత్త కుంట వెనకాల లింకు రోడ్డుకు ఆపోజిట్ గా ఉన్న స్థలం కూడా మా నాన్న సొంతం. అయితే దాంట్లో వ్యవసాయం చేసుకోవడానికి కూడా పాలివారు పుట్ట శ్రీనివాస్, పుట్ట బాల నర్సు లు కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మురికి కాలువలు, వీధిలైట్లు, హిందూ దేవాలయాల స్థలం కబ్జా విషయమై తాను సర్పంచ్ ను తరచూ ప్రశ్నిస్తానని, తన చావుకు ఆ నలుగురే కారణమని, అమ్మానాన్నతో పాటు భార్య పిల్లలు క్షమించాలని నా కూతురు నవోదయ ఎగ్జామ్ రాయాలి, నా కొడుకు అనాధ అవుతాడు అంటూ భారమైన హృదయంతో తప్పని పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్తున్నా... అన్న మెసేజ్ గ్రామ వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసి వ్యవసాయ వద్ద అర్ధరాత్రి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గ్రామంలోని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయడంతో గ్రామస్తులు రాత్రంతా వెతకగా వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూడగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Next Story