protocol : ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు మధ్య ప్రోటోకాల్ రగడ..

by Sumithra |
protocol : ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు మధ్య ప్రోటోకాల్ రగడ..
X

దిశ, కామారెడ్డి : ఒకరేమో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు. మరొకరేమో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడు. ఒకరిది రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిధులు ఇవ్వాలని అడగలేని పరిస్థితి. మరొకరిది ఖచ్చితంగా నిధులు ఇవ్వాల్సిందే అని కొట్లాడలేని నిస్సహాయత.. ఫలితంగా ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరిని అడగలేని దీన స్థితిలో ఉండిపోతున్నారు. ఫలితంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ నియోజకవర్గం ఎక్కడో కాదు. ఇద్దరు సీఎం అభ్యర్థులు పోటీ చేసి ఓడిపోయిన కామారెడ్డి నియోజకవర్గంలో నిధుల విడుదల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.

8 నెలలైనా నిధులు లేవు..

గత సంవత్సరం డిసెంబర్ 7న రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే ఎన్నికల హడావుడి కొనసాగింది. ఎన్నికల తర్వాత కూడా కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పై నాయకులు మాట్లాడే పరిస్థితి కనిపించకపోవడం ప్రజలను అసహనానికి గురి చేస్తోంది. ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల పై సమీక్ష చేపట్టిన పాపాన పోలేదన్న ఆరోపణలున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నియోజకవర్గానికి ప్రత్యేకంగా వచ్చిన నిధులు కూడా ఏమి లేవన్న విమర్శలు వస్తున్నాయి. 8 నెలలు కావస్తున్నా నిధుల మంజూరు విషయంలో నాయకులు చొరవ చూపడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి ఫలానా పనికి నిధులు కావాలని అడిగిన సందర్భాలు లేవన్న చర్చ సాగుతోంది. ఇలా నిధులు మంజూరు చేసుకోలేకపోతే అభివృద్ధి ఎలా సాధ్యమని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఎన్నికలకు ముందు నిధుల వరద..

కామారెడ్డి నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కేసీఆర్ పోటీ నేపథ్యంలో నాటి ప్రభుత్వం నియోజకవర్గానికి నిధుల వరద పారించింది. కోట్లాది రూపాయలు మంజూరు చేసింది. వచ్చిన నిధులను వివిధ పనులకు కేటాయించారు. రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకుల నిర్మాణాలు, పైపులైన్లకు కేటాయించారు. కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, ఇందిరాచౌక్ జంక్షన్లకు నిధులు కేటాయించినా ఆశించిన మేర పనులు మొదలైన దాఖలాలు లేవు. అయితే ఆ నిధులు ప్రభుత్వం నుంచి విడుదలయ్యాయా.. ఒకవేళ విడుదలైతే ఆ పనులు ఎక్కడివరకు వచ్చాయనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం 8 నెలల కాలంలో నియోజకవర్గంలో ఇద్దరు ఉద్దండులు నాయకులుగా ఉన్నారు. అయినా నిధుల కోసం ప్రయత్నాలు చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎమ్మెల్యే వర్సెస్ ప్రభుత్వ సలహాదారు..

కామారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు సీఎం అభ్యర్థుల పై బీజేపీ నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓటమిపాలైనా ప్రభుత్వం ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వ సలహాదారుగా అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఇద్దరు నాయకులు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం ఉంది. గత కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య ప్రోటోకాల్ రగడ కొనసాగుతుంది. ప్రోటోకాల్ విషయంలో ఇద్దరు బెట్టు వీడటం లేదు. ఎవరికి వారే సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. కేబినెట్ హోదాలో ఉన్న షబ్బీర్ అలీ, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రమణారెడ్డికి ఏం చెప్పాలో తెలియక అధికారులు ఇద్దరి మధ్య నలిగిపోతున్నారు.

నిధుల పై ఎవరి దారి వారిదే..

నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల సమీకరణ కోసం ఎవరి దారి వారిదే అన్నట్టుగా నియోజకవర్గంలో రాజకీయాలు కొనసాగుతున్నాయి. కామారెడ్డి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తాగునీటి సమస్య నెలకొంది. ఈ సమస్య ఈ మధ్య పుట్టుకొచ్చింది కాకపోయినా పరిష్కార మార్గాలు చూపాల్సిన బాధ్యత నాయకులు, అధికారుల పై ఉంది. కామారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం నిధులు తీసుకువస్తే ఆ నిధులను రోడ్లకు మళ్లించారని గతంలో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఆరోపించారు. గడిచిన ఎంపీ ఎన్నికల ప్రచారానికి కామారెడ్డి పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధుల మంజూరు కోసం వినతిపత్రం అందజేసినట్టు ఎన్నికల అనంతరం ఓ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ఇలా ఎవరి దారిలో వారు నిధుల కోసం ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

అభివృద్ధి పనులు ఎక్కడ..

గడిచిన 8 నెలల కాలంలో ఇప్పటికి ఒక్క పనికి కూడా నియోజకవర్గంలో శంకుస్థాపన కానీ భూమిపూజ కానీ చేసిన దాఖలాలు లేవని ప్రజలు పెదవి విరుస్తున్నారు. పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయించి మంత్రుల ద్వారా ప్రారంభోత్సవాలు చేయిస్తే నియోజకవర్గానికి నిధులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పక్కనున్న ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు పనులకు ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు తెచ్చుకుంటున్నారని ఉదాహరణగా చూపిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గానికి కూడా ప్రత్యేక నిధులు తీసుకువచ్చి రాజకీయాలతో సంబంధం లేకుండా అభివృద్ధి చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించేలా చూడాలని, జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను త్వరగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో కేటాయించినట్టుగా కొత్త బస్టాండ్, నిజాంసాగర్ చౌరస్తా, ఇందిరా చౌక్ జంక్షన్ పనులు పూర్తి చేయాలని, ఇండోర్ గేమ్స్ కోసం స్టేడియం ఆధునీకరణ పనులు చేపట్టి క్రీడాకారులను ప్రోత్సహించాలని, ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య తీర్చడం కోసం శాశ్వత పరిష్కారం చూపాలని, వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచాలని కోరుతున్నారు.



Next Story