జిల్లా నుంచి మంత్రి నియామకానికి లైన్ క్లియర్

by Naresh |
జిల్లా నుంచి మంత్రి నియామకానికి లైన్ క్లియర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవిని ఎవరిని వరిస్తుందోనన్న సస్పెన్షన్‌కు తెర పడింది అంటే రాజకీయ విశ్లేషకులు ఔననే అంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ మంత్రి రేసులో ఉండడంతో సామాజిక సమీకరణలు నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు ఆమాత్య పదవి దక్కని విషయం తెల్సిందే. ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీతో పాటు ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ లు కాంగ్రెస్ పార్టీలో సీనియర్లుగా ఉన్న విషయం తెల్సిందే. గడిచిన ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీలు అసెంబ్లీకి పోటీ చేయగా సుదర్శన్ రెడ్డి గెలుపొందగా, షబ్బీర్ అలీ ఓటమి పాలైన విషయం తెల్సిందే.

అదే సమయంలో అసెంబ్లీకి పోటీ చేద్దామనుకున్న మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఆదేశానుసారం తన సీటును షబ్బీర్ అలీకి త్యాగం చేసిన విషయం విధితమే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయధుంధుబి మోగించడం, ఉమ్మడి జిల్లాలో నలుగురు మాత్రమే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందోనన్న సస్పెన్షన్ నెలకొన్న విషయం తెల్సిందే. అయితే జిల్లా నుంచి గెలిచిన సుదర్శన్ రెడ్డి ఒకరే సీనియర్ కావడంతో మిగిలిన ముగ్గురు అసెంబ్లీకి ఎంపిక కావడం మొదటిసారి కావడంతో సుదర్శన్ రెడ్డికే మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగింది.

రాష్ట్రంలో 17 కేబినెట్ పదవుల స్థానాలకు గాను ఎక్కువ మొత్తంలో అగ్రవర్ణాలకు లభించడంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీసీలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో మంత్రి పదవిపై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లా నుంచి బీసీలు ఎవరు ఎన్నిక కాకపోవడం, మైనార్టీ లీడర్లు కూడా ఎలక్షన్ లో గెలువ కపోవడంతో ఆ కోటాలో ఎవరికైనా మంత్రి పదవి ఇవ్వాలని మొదటి విడతలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వలేదనే ప్రచారం ఉంది. తాజాగా ఎమ్మెల్యే కోటాలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన చట్టసభకు వెళ్లడం ఖాయమైంది. అయితే మహేష్‌ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి ఇస్తారా లేక పీసీసీ చీఫ్ పదవి ఇస్తారా అన్నది కాంగ్రెస్ అగ్రనాయకత్వం తేల్చలేదు.

అదే సమయంలో జిల్లాకు చెందిన షబ్బీర్ అలీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారునిగా నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీకి భవిష్యత్తులో మంత్రి పదవి దక్కదని తేలిపోయింది. అయితే షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారునిగా నియమిస్తునే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల సలహాదారునిగా కేబినెట్ ర్యాంక్ కలిగిన పదవి ఇవ్వడంతో జిల్లా నుంచి ఆయనకు ఎన్నికల్లో ఓటమి చెందిన సముచిత స్థానం కల్పించారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో మంత్రి పదవి నియామకం విషయంలో సుదర్శన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే రేసులో మిగిలినట్లయింది.

మొదటి విడతలో ప్రధానంగా హోంతో పాటు విద్యాశాఖ లాంటి మంత్రి పదవులను ఎవరికి ఇవ్వలేదు. వాటిని నిజామాబాద్ జిల్లాకే ఇస్తారని కాంగ్రెస్‌లో చర్చ జరుగుతుంది. అయితే ఓసీ కావడంతోనే సుదర్శన్ రెడ్డికి మొదటి విడతలో మంత్రి పదవి దక్కలేదని ఆయనను సభాపతి పదవికి నామినేట్ చేసిన అంగీకరించలేదని అందరికీ తెలిసిందే. మంత్రి పదవి కోసమే పట్టుబట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన మహేష్ కుమార్ గౌడ్ శాసనమండలికి ఏకగ్రీవంగా ఎంపిక కావడం ఖాయమైపోయిన విషయం తెల్సిందే. ఆయనకు కూడా బీసీ కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఆయనకు పీసీసీ చీఫ్ చేస్తారని అందుకు ఎఐసీసీ పెద్దల ఆశీస్సులు ఉన్నాయని చెబుతున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగితే కానీ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికి మంత్రి పదవి వరిస్తుందో తేలిపోనుంది.

Advertisement

Next Story