జిల్లాలో సంచలనం రేపుతున్న నకిలీ పాస్ పోర్టులు, డాక్యూమెంట్ల వ్యవహారం

by Naresh |
జిల్లాలో సంచలనం రేపుతున్న నకిలీ పాస్ పోర్టులు, డాక్యూమెంట్ల వ్యవహారం
X

దిశ, భీంగల్: నిజామాబాద్ జిల్లా నుంచి విదేశాలకు తరలి వెళ్ళే వారికి నకిలీ పాస్ పోర్టులు అందించే వ్యవహరంలో భీంగల్‌కు చెందిన ప్రైవేట్ ఏజంట్‌ను సీబీసీఐడి అధికారులు అరెస్టు చేయడం కలకలం రేపింది. రెండు రోజుల క్రితం సీబీసీఐడీ అదికారులు భీంగల్ పట్టణంలో చెప్పాల సుభాష్ అనే పాస్ పోర్టు బ్రోకర్‌ను అరెస్టు చేసి తరలించగా అప్పటి నుంచి పాస్ పోర్టు కార్యాలయాలు , ట్రావెల్ ఏజెన్సీలు మూతపడ్డాయి. అయితే నిజామాబాద్ జిల్లా నుంచి నకిలీ పాస్ పోర్టులు తయారి, అందుకు సహకరించడం కొత్త ఏమి కాదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా గల్ప్ దేశాలకు వెళ్లే కార్మికుల విషయంలో తెలంగాణలోనే మొదటి స్థానమని చెప్పాలి. 1970 దశకంలోనే జిల్లా నుంచి గల్ఫ్‌లో పని చేసేందుకు వెళ్లిన చరిత్ర ఉంది. ఒక్క నిజామాబాద్ జిల్లా నుంచే దాదాపు 2 లక్షల కార్మికులు గల్ప్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ఉపాధి దొరకకపోవడంతో చదువుకున్న యువత కూడా గల్ప్ దేశాలు వెళ్తున్నారు. దాన్ని సొమ్ము చేసుకుంటూ అర్హులు కానీ వారికి అనర్హులను గల్ప్ దేశాలకు పంపించే వ్యవహారం జిల్లాలో కొనసాగుతుంది.

నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఓ ప్రజాప్రతినిధి పై మానవ అక్రమ రవాణా కేసులు ఇప్పటికి పెండింగ్‌లో ఉన్నాయి. ఆయన రెండు సార్లు ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ఆ కేసు మాత్రం కొలిక్కి రాలేదు. రెండు సంవత్సరాల క్రితం 2022లో బోధన్‌లో రోహంగ్యాలకు పాస్ పోర్టులు అందించిన వ్యవహరం వెలుగులోకి వచ్చింది. ఎన్ఐఏతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి 120 పాస్ పోర్టులు బోధన్ పట్టణ కేంద్రంగా వెలుగులోకి వచ్చాయి. అనాడు పాస్ పోర్టుల తయారికి సూత్రదారులైన మీ సేవా కేంద్రం నిర్వాహకులను అరెస్టు చేశారు. అయితే పాస్ పోర్టుల జారీ కొరకు విచారణ జరిపిన ఎస్‌బీ హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఎఎస్సైని సస్పెండ్ చేసి అరెస్టు చేశారు. అనాటి పాస్ పోర్టుల వ్యవహరంలో దాదాపు 75 మందికి పైగా రోహింగ్యాలు బోధన్ అడ్రస్‌లపై పాస్ పోర్టులు పొంది విదేశాలకు వెళ్లి నట్లు గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలకు ఉపక్రమించారు. నకిలీ పాస్ పోర్టులు తీసేందుకు నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ సర్టిఫికెట్ల తయారీ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.ఈ కేసులో సీబీ సీఐడీ పోలీసులు భీంగల్ పట్టణం లో రెక్కీ నిర్వహించి, సోదాలు చేపట్టి ఎస్సీ కాలానికి చెందిన చెప్పాల సుభాష్ అనే పాస్ పోర్ట్ బ్రోకర్‌ను అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఇప్పటి వరకు సీబీ సీఐడీ పోలీసులు పట్టణానికి గాని ఈ ప్రాంతానికి గాని రావడం మొదటి సారి కావడంతో స్థానికులకు సినిమాలు, సీరియళ్లను తలపించినట్లయ్యింది. సీఐడీ పోలీసులు భీంగల్‌లో సోదాలు నిర్వహించి లాప్ టాప్, కొన్ని డాక్యూమెంట్ల‌తో పాటు నకిలీ స్టాంప్లను స్వాధీనం చేసుకోవడంతో స్థానికంగా ట్రావెల్స్‌లు నడిపే యజమానుల గుండెల్లో రైళ్లు పరుగేడినంత పని అయ్యింది.

నిందితుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిందే తడువు ట్రావెల్స్ షాప్ లన్ని మూసి వేశారు. శుక్రవారం సంఘటన జరగగా శనివారం కూడా ట్రావెల్స్‌లు తెరుచుకోలేదు. ట్రావెల్స్‌లల్లో ఉన్న సిస్టంలు, డాక్యూమెంట్లు అన్నింటిని గాయబ్ చేసినట్లు తెలుస్తోంది. గత పది సంవత్సరాల క్రితం కూడా భీంగల్ కేంద్రంగా తప్పుడు ధృవ పత్రాలతో పాస్ పోర్ట్ లు ఇప్పించినట్లు సమాచారం. మండల పరిషత్ కాంప్లెక్స్‌లో ఇంటర్ నెట్ కేఫ్ కేంద్రంగా ఈ తంతు నడిచింది. కరీంనగర్ జిల్లా మెట్ పల్లి పోలీసులు వ్యవహారం బట్ట బయలు చేయడంతో నకిలీ తంతు కాస్త సద్దుమణిగింది .నకిలీ పాస్ పోర్ట్ ల వ్యవహారం మళ్ళీ తాజాగా తెరపైకి రావడంతో పాత నకిలీ పాస్ పోర్టుల బ్రోకర్లకు కంటి మీద కునుకు కరువైంది. తాజాగా సీబీ సీఐడీ పోలీసులు సుభాష్ ను అరెస్ట్ చేయడంతో పాటు నిందితుని వద్ద లాప్ టాప్, డాక్యూమెంట్స్ ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకొన్నారన్న సమాచారంతో తమ బాగోతం బయటకు వస్తుందేమోనన్న భయంతో మాజీ బ్రోకర్లకు కంటి మీద కునుకు కరువైంది. నకిలీ పాస్ పోర్టులు డాక్యుమెంటేషన్ వ్యవహరంలో సుభాష్‌కు సహకరించిన స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ఎవరనే చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed