- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉబికి వస్తున్న" ఊట" దార..

దిశ, భిక్కనూరు : భూగర్భ జలాలు పాతాళానికి చేరి, బోరు బావులు ఒట్టిపోయిన పరిస్థితుల్లో, ఊట బావుల నుంచి ఉబికి వస్తున్న నీళ్లతో రెండు పంటలు సాగు చేస్తున్నారంటే నమశక్యం కావడం లేదు కదూ. ఔను నిజమే ఆ బావులలో ఉన్న నీటితోనే వరి, చెరకు, ఆరుతడి పంటలను సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. తాత ముత్తాతల కాలం నుంచి ఊట బావుల పైనే ఆధారపడి సేద్యం చేస్తున్న రైతులు మాత్రం, సాంప్రదాయ వ్యవసాయ విధానాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో గుండా రాజు, మాడుపు రవీందర్ రెడ్డి, గాడి సురేష్, గుండా నవీన్, గుండా స్వామి, గుండా శేఖర్, గుండా భూపతి, గుండా లింగం, దేమే రాంరెడ్డి, పోతంగల్ కృష్ణారెడ్డిలకు చెందిన 10 ఊట బావులు ఉన్నాయి. ఆ బావుల కింద 40 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తుంటారు. అప్పుడప్పుడు బావులలో పేరుకుపోయిన పూడికను తీపిస్తుంటారు తప్పితే, నీళ్లు లేక బావులు ఎండిపోయాయన్న పరిస్థితి మాత్రం రైతులు ఇంతవరకు చూడలేకపోయారు. ఏడాదికి రెండు పంటలు సాగు చేస్తున్న రైతులకు, ఆశించిన స్థాయిలో పంట దిగుబడి వస్తుంది.
ఆ చెరువు ఎండిపోయినా నీళ్లకు మాత్రం ఢోకా లేదు.. జంగంపల్లి హైవే పక్కన ఉన్న పెద్ద చెరువు ఊట బావులకు సమీపంలోనే ఉన్నప్పటికీ, చెరువులో నీళ్లు లేక ఎండిపోయినా ఈ బావులలో నీళ్లకు మాత్రం డోకా లేదని గ్రామస్తులు చెబుతున్నారు. కేవలం వేసవి కాలంలో మాత్రమే ఊటదార ఎక్కువ, తక్కువ అవుతోంది తప్ప వానాకాలంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది మాత్రం ఉండదు. ప్రస్తుతం ఎండలు మండిపోతుండడం వలన, ఒక్కో బావిలో అయిదారు గజాల లోతులో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ బావులకు సమీపంలోని బోరు బావులు ఎండిపోయి, ఆ బావుల కింద సాగు చేసిన మొక్కజొన్న, వరి పంటలు పూర్తిగా దెబ్బతినగా, ఊట బావుల కింద సాగు చేసిన పంట భూములు మాత్రం పచ్చగా, సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొంతమంది రైతులు, ఆ ఊట బావుల కింద, దినం తప్పించి దినం పంటలకు నీళ్లు పారబెట్టుకుంటున్నారు. అయితే ఈ ఊట బావులన్ని గ్రామ శివారులోనే ఉండగా, వీటి పక్కనే రాజంపేట మండలం తలమడ్ల, శివాయిపల్లి భూములు కూడా ఉన్నప్పటికీ బోరు బావులు వట్టిపోవడంతో, సాగు చేసిన పంటలను పంటలను పూర్తిగా దున్నేశారు.
కరెంటు ఉంటే చాలు..
ఇక్కడ పంటల సాగుకు ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికీ, బావుల వద్ద కరెంటు ఉంటే చాలు, పుష్కలంగా పంటలు సాగు చేసుకోవచ్చు. అయితే ఊహించని విధంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి, చాలా మట్టుకు బోర్లు బంద్ అయినప్పటికీ, ఈ ఊట బావులు మాత్రం కరెంటు ఉంటే చాలు పంటలకు అవసరమైన నీళ్లు అందిస్తుండడం ఈ బావుల ప్రత్యేకం.