గెస్ట్ హౌస్ ల్యాండ్ పై కన్ను..

by Sumithra |
గెస్ట్ హౌస్ ల్యాండ్ పై కన్ను..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : గత ప్రభుత్వంలో ప్రభుత్వ భూమిగా (గ్రామకంఠం, ఆబాది భూమి)లో గెస్ట్ హౌస్ నిర్మాణం శంకుస్థాపన జరిగింది. కానీ ప్రభుత్వం మారిందో లేదో దాని పై కన్ను పడింది. దానికి ఒక లెక్క ఉంది. గతంలో గ్రామస్తులు ఆబాదిగా ఒక వ్యక్తికి దారదత్తం చేయగా దానిని ప్రజాప్రయోజనార్థం గెస్ట్ హౌజ్ నిర్మించగా దానిని కబ్జా చేసేందుకు ఏకంగా పావులే కదులుతున్నాయి. కమ్మర్ పల్లి టూ కామారెడ్డి నాలుగు లైన్ల రహదారి పై ఉన్న విలువైన భూమి ఇప్పుడు కబ్జా కోరల్లో చిక్కింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో గ్రామ కంఠం భూమి(ఆబాది) భూమిలో గత ప్రభుత్వ హయంలో సుమారు 500 గజాల్లో గెస్టు హౌజ్ నిర్మాణానికి ఆ నాటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రభుత్వ నిధులతో నిర్మాణానికి భూమి పూజ చేశారు.

సుమారు కోటి రూపాయలకు పైగా నిధులు కూడా మంజూరయ్యాయి. కానీ ఇంతలో ఎన్నికలు రావడం అక్కడ బాజిరెడ్డి గోవర్దన్ ఓటమి చెందడంతో ఇప్పుడు ఆ భూమి పై కొందరు కన్ను పడింది. ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదురుగా నాలుగు లైన్ల రహదారి ప్రతిపాదన ఉన్న ప్రాంతంలో విలువైన భూమిలో రాత్రికి రాత్రే మొరం పోసి కబ్జా ప్రయత్నాలు షురూ అయ్యాయి. అందుకు ఒక అధికార పార్టీ నేత తతంగం నడుపుతున్నాడని చర్చ జరుగుతుంది. గతంలో గ్రామంలో సేవ చేస్తున్న ఒక కుటుంబానికి ఎకరానికి పైగా భూమిని గ్రామస్తులు ఇచ్చారు. సంబంధిత భూమిలోనే పోలీస్ స్టేషన్ తో పాటు ఇతర నిర్మాణాలు కూడా జరిగాయి. అయితే దశాబ్ధాలుగా భూమి ఖాళీ ఉండడంతో సరిహద్దులో వీఐపీలు, అధికారులు పర్యటన సమయంలో సేదతీరేందుకు గాను గెస్ట్ హౌజ్ నిర్మాణానికి సంకల్పించిన విషయం తెల్సిందే.

అయితే గతంలో భూమి కేటాయింపులు జరిగిన వ్యక్తే తెర ముందుకు వచ్చి సంబంధిత భూమి తమకు కేటాయించడం లేదని అందులో తన స్థలం నిర్మాణం చేసుకుంటామని పనులు చేయడం గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ప్రజాప్రయోజనార్థంగా ఉన్న భూమి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కబ్జా కోరల్లోకి వెళ్లడమేమిటని ప్రశ్న మొదలయింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో సంబంధిత భూముల గెస్ట్ హౌజ్ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కూడా వెనక్కి మళ్లాయని అక్కడ ఎలాంటి నిర్మాణం జరుగదన్న ధైర్యంతో సంబంధిత భూమిని కబ్జా చేసేందుకు యత్నించడం చర్చనీయాంశంగా మారింది.

ఒక ప్రభుత్వ హయంలో ప్రభుత్వ భూమిగా, మరో ప్రభుత్వ హయంలో కబ్జాలు జరుగడం, మండలంలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాలు మారినంత మాత్రన భూములు కబ్జాకు గురవుతాయా అని ప్రశ్న తలెత్తుతుంది. ఈ విషయంలో అధికారులు మౌనం వహించడం వెనుక ఒత్తిడి ఉందన్న ప్రచారం జరుగుతుంది. మండల కేంద్రం నడిబొడ్డున కోట్ల విలువ చేసే భూమి కబ్జాదారుల భారిన పడుతుంటే రెవెన్యూ శాఖ ఎందుకు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

Next Story

Most Viewed