నష్టపరిహారం ఎక్కువనే ఇప్పిస్తా

by Sridhar Babu |
నష్టపరిహారం ఎక్కువనే ఇప్పిస్తా
X

దిశ, భిక్కనూరు : మీరు కోరిన దానికంటే ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చూస్తానని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ బాధిత రైతులకు భరోసా కల్పించారు. ఆదివారం సాయంత్రం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గొట్టిముక్కుల, భిక్కనూరు మండలం లక్ష్మీ దేవునిపల్లి, అంతంపల్లి, రామేశ్వర్ పల్లి గ్రామాలలో వడగండ్ల వానతో నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా కురిసిన వడగండ్ల వాన కు ఎకరాకు 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం అందేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు షబ్బీర్ అలీ స్పందిస్తూ మీరు కోరిన దానికంటే ఎక్కువ మొత్తంలో ప్రభుత్వం నష్టపరిహారం అందించే విధంగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడతానని, జరిగిన పంట నష్టంపై పూర్తి వివరాలు సేకరించి,

సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పిస్తానన్నారు. బాధిత రైతులను ఆదుకునే విధంగా కృషి చేస్తానన్నారు. గతంలో ఎప్పుడైనా బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ రైతులకు పంట నష్టపరిహారం అందజేసిందా...? అని ప్రశ్నించారు. కానీ తమది రైతు ప్రభుత్వం కాబట్టి పంటలను పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. లక్ష్మీ దేవునిపల్లిలో దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేకులు వేసుకోకుండా, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 6 లక్షల రూపాయలు ఇప్పిస్తానని, స్లాబ్ పోసుకొని ఇల్లు కట్టుకోవాలని సూచించారు. దెబ్బతిన్న ఇండ్ల మరమ్మతులకు తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గ్రామాల వారీగా రైతులు షబ్బీర్ అలీకి వినతి పత్రాలు అందజేశారు.

ఆయన వెంట డీసీసీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు, టీపీసీసీ కార్యదర్శి బద్ధం ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షులు మద్ది చంద్రకాంత్ రెడ్డి, ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, దోమకొండ జెడ్పీటీసీ సభ్యులు తీగల తిరుమల గౌడ్, ఎన్నారై సెల్ జిల్లా కన్వీనర్ చిట్టెడు సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపరి భీం రెడ్డి, బీబీపేట పార్టీ మండల శాఖ అధ్యక్షులు సుతారి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్యాల సుదర్శన్, తాటిపాముల లింబాద్రి, గొల్లపల్లి వినోద్ గౌడ్, మద్ది సూర్యకాంత్ రెడ్డి, పీఏ గంగాధర్, కల్లూరి సిద్ధ రాములు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story