Hunger Strike : ఈనెల 9న దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష

by Hajipasha |
Hunger Strike : ఈనెల 9న దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరాహార దీక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై బెంగాల్‌లో డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలకు సంఘీభావంగా బుధవారం (అక్టోబరు 9న) దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేపడుతామని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) ప్రకటించింది. సోమవారం నిర్వహించిన ఫైమా సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు.

‘‘నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న వైద్యులకు నైతిక మద్దతు తెలిపేందుకు మేమంతా బుధవారం రోజు నిరాహార దీక్ష చేయబోతున్నాం. ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో పని వాతావరణం మెరుగుపడాలనేది మా డిమాండ్. డాక్టర్లకు భద్రత మరింత పెరగాలి. మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. వైద్యులంతా ఏకతాటిపై ఉన్నారని ఈ దీక్ష ద్వారా నిరూపిస్తాం’’ అని ఫైమా ఓ ప్రకటనలో తెలిపింది. జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఈనెల 9తో సరిగ్గా రెండు నెలలు పూర్తవుతాయి. అయినా ఇంకా విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

Advertisement

Next Story