ఆర్మూర్ మున్సిపాలిటీ ‘అవిశ్వాసం’పై కోర్టుకెక్కిన చైర్ పర్సన్?

by Nagaya |   ( Updated:2024-01-20 14:48:21.0  )
ఆర్మూర్ మున్సిపాలిటీ ‘అవిశ్వాసం’పై కోర్టుకెక్కిన చైర్ పర్సన్?
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లేక అనాథగా మిగిలింది. ఇప్పటి వరకు చైర్ పర్సన్‌గా ఉన్న పండిత్ వినీత పవన్‌పై జనవరి 4న అవిశ్వాసం నెగ్గడంతో పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఇక అప్పటి నుంచి దిక్కూమొక్కు లేకుండా పోయింది ఈ మున్సిపాలిటీ. దీంతో పట్టణ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వైస్ చైర్మన్‌కు చైర్మన్ బాధ్యతలు ఇవ్వాలంటూ ధర్నా...

ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని కెనాల్ బ్రిడ్జి వద్ద శనివారం మైనారిటీ, మార్కాజ్ కమిటీ సభ్యులు వైస్ చైర్మన్‌గా ఉన్న షేక్ మున్నాకు చైర్మన్ బాధ్యతలు అప్పగించాలంటూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చైర్మన్ లేకపోవడంతో అభివృద్ధి కుంటపడిందని, పట్టణంతో పాటు ఇందులో విలీనమైన మామిడిపల్లి, పెర్కిట్‌లలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నందున అధికారులు, ప్రభుత్వం స్పందించాలని వారు కోరారు. అంతకుముందు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని పలువురు కౌన్సిలర్లు ఆర్డీఓ, కలెక్టర్‌ను వేర్వేరుగా కలిసి వినతి పత్రాలను అందజేశారు.

కోర్టుకెక్కిన చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్?

గత నాలుగేళ్లుగా చైర్పర్సన్‌గా కొనసాగిన పండిత్ వినిత పవన్ పై ఈనెల 4వ తేదీన స్వపక్షానికి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఉన్న ఎమ్మెల్యేతో సహా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇద్దరు స్వతంత్ర కౌన్సిలర్లతో సభ్యుల సంఖ్య 37కు చేరుకుంటుంది. దీనిలో 24 మంది చైర్ పర్సన్‌కు వ్యతిరేఖకంగా ఓటు వేయడంతో ఆమెకు ఊహించని షాక్ తగిలి పదవీ నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే మున్సిపల్ అవిశ్వాస తీర్మానానికి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాజరై ఓటు వేయకపోవడం ఆర్మూర్లో చర్చకు దారి తీసింది. ఇదే అదునుగా తీసుకున్న చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మానం చెల్లదని కోర్టుకు ఎక్కినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎమ్మెల్యే ఓటుతో మున్సిపల్ కౌన్సిలర్ సభ్యుల బలం 37 కు చేరుకుందని, అవిశ్వాసంలో ఎమ్మెల్యే ఓటు వేయలేదని 36 మంది కౌన్సిలర్ల సంఖ్య బలం ప్రకారం 24 మంది కౌన్సిలర్లతో అవిశ్వాస పరీక్షను నెగ్గినట్లు అధికారులు ప్రకటించారని, ఇది చెల్లదని అవిశ్వాస పరీక్ష ఎదుర్కొన్న పండిట్ వినీత పవన్ కోర్టు మెట్లు ఎక్కినట్లు సమాచారం. ఏది ఏమైనా ఆర్మూర్ మున్సిపల్ వ్యవహారం కొలిక్కి రావాలంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో వేచిచూడాలి.

Advertisement

Next Story