ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటితో ముగియనున్న ప్రచారం

by Mahesh |
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేటితో ముగియనున్న ప్రచారం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పార్లమెంట్ ఎన్నికల పర్వం లో కీలకమైన ప్రచార పర్వం తెరపడే సమయం ఆసన్నమైంది. శనివారం ఎన్నికల ప్రచార గడువు పూర్తి కానుంది. గత 20 రోజులుగా హోరెత్తించిన మైకులు సాయంత్రం 6 గంటలకు బంద్ కానున్నాయి.గత నెల వెలువడిన ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుంచి జిల్లాలోని 5 నియోజకవర్గాల పరిధిలో ప్రచారం జోరుగా సాగింది. కేంద్ర హోంమంత్రి మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత వరకు నిజామాబాద్ జిల్లాలో ప్రచారాన్ని హోరెత్తించారు. పబ్లిక్ మీటింగ్ లో, కార్నర్ మీటింగ్ లు, రోడ్ షోలు జోరుగా జరిగాయి. రాహుల్ గాంధీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ మినహా మిగిలిన అగ్రనేత జాతీయ పార్టీల పక్షాన ప్రచారం చేశారు. లిక్కర్ కేసు కారణంగా స్టార్ క్యాంపెయినర్ కవిత ప్రచారానికి దూరమయ్యారు. కేటీఆర్ జిల్లాలో పర్యటించను లేదు. కేసీఆర్, హరీష్ రావు మినహా బీఆర్ఎస్ అగ్రనేతలు ఎవరు ప్రచారం చేయలేదు. ప్రచార విషయంలో మీటింగ్‌లలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కుల సంఘాలు, యువజన సంఘాల మద్దతు అన్ని పార్టీలు తెగ కసరత్తు చేశాయి. ఈసారి కూడా ఒక బీఆర్ఎస్ మినహా జాతీయ పార్టీలలో చేరికలు జోరుగా జరిగాయి.

రెండు పార్టీలు చేరికల బలమని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర పార్టీ అయిన బీఆర్ఎస్‌లో మాత్రం లీడర్లు పోయిన క్యాడర్ మాత్రం తమతో ఉండి బలంగా ఉన్నామని చెబుతున్నారు. ప్రచార పర్వంలో గత ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ప్రధానమైతే ఈసారి చక్కెర పరిశ్రమలను తెరిపించడం, గల్ఫ్ బోర్డు అంశం, ఉపాధి అంశాలు ప్రభావం చూపుతాయని దానిపైనే ప్రచారం జరిగింది. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా అందులో తమ హామీలు ప్రధానంగా వాటికే ప్రాధాన్యత ఇచ్చాయి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా నుంచి జీవన్ రెడ్డి జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండగా సిట్టింగ్ ఎంపీ అర్వింద్ రెండోసారి బీజేపీ తరపున, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. మూడు పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ప్రచారం సాగింది.

ఈసారి మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించినా ఇప్పటి వరకు ప్రచారంలో ఆ అంశమేది ప్రభావం చూపినట్లు కనిపించడం లేదు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రచార పర్వంలో ఎలాంటి వివాదాలు లేకపోవడంతో కేసులు, గొడవలు లాంటివి జరుగలేదు. అయితే జాతీయ అంశాలపై వివిధ వివాదాలపై మాత్రం పోలీసులకు ఫిర్యాదులు జరిగాయి. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలను మరిపిస్తున్నాయని చెప్పాలి. రెండు జాతీయ పార్టీలతో పాటు లోకల్ పార్టీ బీఆర్ఎస్ కూడా ప్రచారంలో దూసుకుపోయాయి. అదే సమయంలో ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.

తొలిసారి ఎన్నికల్లో ప్రచారం కోసం తెగ ఖర్చు చేసిన లీడర్లు ఎన్నికల్లో గంప గుత్త ఓట్ల కోసం వెనుకాడడం లేదు. కుల సంఘాలకు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ప్రతినిధులతో పాటు తమ పార్టీలలో ఉన్నా ఆయా శాఖల ఆధ్వర్యంలో కులాల వారీగా, మతాల వారీగా ఓటర్లకు తాయిలాల పంపిణీ సిద్దమైంది. స్టార్ హోటల్ మొదలుకుని ఏ అవకాశం ఇచ్చినా వదలకుండా ఓట్లను రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి కుల సంఘాలతోనే నేరుగా ప్రచారం చేయించుకుని ఆయా సామాజిక వర్గాల ఓట్లను దండుకునే పనిలో పడ్డారు. శనివారం సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూసివేతకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో ముందస్తుగా మద్యం డంప్‌లను చేసిన లీడర్లు వాటిని రాత్రికి రాత్రే లీడర్లకు వీలైతే ఓటర్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎన్నికల కమిషన్ ఇచ్చిన కోటి రూపాయల ఎన్నికల ఖర్చు పరిమితి ఏ మూలకూ సరిపోయేలా లేదని కొందరు అభ్యర్థులు వాపోతున్నారు. మిగిలిన అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో తమకు రావాల్సిన వాటి కోసం లీడర్ల ఇళ్ల వద్ద ఆయా సంఘాల ప్రతినిధుల, చోటామోటా లీడర్స్, క్యాండెట్ల ఇంటి వద్ద రాత్రనక పగలనక తిష్ట వేసి తమకు రావాల్సిన సొత్తును, మద్యాన్ని తరలించుకపోతున్నారు. ఎన్నికల కమిషన్ ఎక్కడ నిఘా పెడుతుందోనని రహస్య ప్రాంతాల నుంచి ఈ తతంగం జరుగుతుంది. ప్రత్యేకంగా లీడర్లు వాటి కోసం కొందరిని ఎంపిక చేసుకుని ఈ తతంగాన్ని పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ నెల 12 రాత్రి వరకు ప్రలోభాల పర్వం జోరుగా సాగే అవకాశం ఉంది. కొందరైతే ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేస్తామని ఓటర్లు చెబుతున్నారు. ఓటర్లు కూడా సాధారణ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికల్లో లీడర్లు ఇచ్చే వాటిని పుచ్చుకుని తమకు నచ్చే వారికే ఓట్లు వేసేలా ఉన్నారని మరో టాక్ నడుస్తుంది.

Advertisement

Next Story

Most Viewed