సర్వేకు ఆదేశించామని చెప్పి... సైలెంట్ అయ్యారు

by Sumithra |
సర్వేకు ఆదేశించామని చెప్పి... సైలెంట్ అయ్యారు
X

దిశ, భిక్కనూరు : బోధరాగు కాలువ కనుమరుగు కథనం పై అధికారులు స్పందించినట్టే స్పందించి.. సైలెంట్ కావడం వెనక రాజకీయ ఒత్తిల్లే కారణమా...? అన్న అనుమానం కలుగుతోంది. అనాదిగా వస్తున్న ఆ కాలువను ఫార్మా కంపెనీ యాజమాన్యం కబ్జా చేయడమే కాకుండా, ఆనవాళ్లు కూడా దొరకకుండా రోడ్డును ఆక్రమించి ప్రహరీ గోడ నిర్మించడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ " దిశ " మూడు రోజుల క్రితం ప్రముఖంగా ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన భిక్కనూరు తహశీల్దార్ శివప్రసాద్ సర్వేకు ఆదేశించినట్లు చెప్పినప్పటికీ ఆ తర్వాత సైలెంట్ కావడం వెనుక అంతర్యమేమిటన్నది అంతుచిక్కని ప్రశ్న. ఈ విషయమై "దిశ " అధికారిని ప్రశ్నించగా వీడియో కాన్ఫరెన్స్ లు, అధికారులకు రిపోర్టులు పంపడం వంటి బిజీ పనులలో ఉండడం వలన అక్కడికి వెళ్లలేక పోతున్నామని దాటవేస్తున్నారు. అయితే అధికారులు సైలెంట్ అవ్వడానికి ఫార్మా కంపెనీకి వత్తాసు పలుకుతున్న నాయకుల ఒత్తిళ్లే ప్రధాన కారణమన్న ప్రచారం జరుగుతోంది.

రెండోసారి ఫిర్యాదు..

రోడ్డును కబ్జా చేసి తన వ్యవసాయ భూమిలోకి వెళ్లకుండా ప్రహరీ గోడ నిర్మించారని సోమవారం భిక్కనూరు తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితురాలు తాటిపాముల రాజమణి రెండోసారి కూడా ఫిర్యాదు చేసింది. వెంటనే అధికారులు స్పందించి అదే రోజు స్పాట్ వద్దకు సర్వేయర్ ను పంపినప్పటికీ, సర్వే చేయకుండానే పరిస్థితిని అబ్జర్వ్ చేసి కంప్యూటర్ లో చూసి చెబుతానని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు. ఈ విషయమై ఆ రోజు నుంచి అధికారుల వద్దకు వెళ్లి కలిసి వస్తున్నప్పటికీ, తనకు ఎలాంటి న్యాయం జరగడం లేదని వాపోతోంది.

Next Story

Most Viewed