హత్యాయత్నం కేసులో వ్యక్తికి పదేళ్ళ జైలుశిక్ష..

by Sumithra |   ( Updated:2023-06-28 14:00:48.0  )
హత్యాయత్నం కేసులో వ్యక్తికి పదేళ్ళ జైలుశిక్ష..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ఒక వ్యక్తి పై హత్యాయత్నం చేసినందుకుగాను ఐదేళ్ళు, ఆయుధాన్ని నేరపూరిత చర్యకు వినియోగించినందుకు గాను మరో ఐదేళ్ల కఠిన జైలు శిక్షలు విధిస్తూ నిజామాబాద్ జిల్లా షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగల అత్యాచారాల నిరోధక విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి టి.శ్రీనివాస్ బుధవారం తీర్పు వెలువరించారు. తీర్పులోని వివరాల ప్రకారం బోధన్ పట్టణానికి చెందిన కవల పోశెట్టి అనే వ్యక్తి 16 జూన్ 2019 న మోచిగల్లికి వెలుచుండగా మార్గమధ్యలో తనకు పరిచయస్థుడైన సన్ను సింగ్ కనబడడంతో అతని పై ఉన్న తల్వార్ ఒకసారి ఇస్తే దాన్ని చూసి మళ్ళీ ఇస్తానని అడిగాడు. దాంతో కోపగించుకున్న సన్ను సింగ్ నన్నే తల్వార్ ఇవ్వమని అడుగుతావ అంటు తల్వార్ తో పోశెట్టి వెంటపడి చంపివేస్తానని అతని కుడి కాలు మోకాలిపై, ఎడమ చేతి భుజం పై తల్వార్ తో పొడిచి తీవ్రంగా గాయపరచి హత్యాయత్నం చేశాడు.

ఈ కేసులో పోలీసులు సన్నుసింగ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో న్యాయస్థానం న్యాయమూర్తి తమ తీర్పులో హత్యాయత్నానికి గాను ఐదేళ్ల కఠిన జైలుశిక్ష ఒక వేయి రూపాయల జరిమాన, తల్వార్ తో నేరపూరిత చర్యకు పాల్పడినందుకు గాను మరో ఐదేళ్ల కఠిన జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని ఎడల మరో నెల రోజుల జైలుశిక్ష గడపాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని తెలుపుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి నిరోధక చట్టం సెక్షన్లలో మోపబడిన నేరాలు నేర నిరూపణ కానందున కొట్టివేశారు. పోలీసుల తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కవిత రెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

Advertisement

Next Story

Most Viewed