ఆటో గిరాకీ లేక...ఆర్థిక పరిస్థితి బాగోలేకనే స్వామి ఆత్మహత్య

by Sridhar Babu |   ( Updated:2024-03-13 14:29:10.0  )
ఆటో గిరాకీ లేక...ఆర్థిక పరిస్థితి బాగోలేకనే స్వామి ఆత్మహత్య
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన భర్త తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. ఆటో గిరాకీ లేక...ఆర్థిక పరిస్థితి బాగోలేకనే స్వామి ఆత్మహత్య చేసుకున్నట్టు తేలింది. నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిల్లా కెనాల్ కట్ట ప్రాంతంలోని ఆటో డ్రైవర్ స్వామి (45) ,దేవలక్ష్మి (40) దంపతులు తమ కుమారుడు మల్లికార్జున్ తో కలిసి నివసిస్తున్నారు. కుమారుడు మల్లికార్జున్ డిచ్పల్లి మండలం బీబీపూర్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

బుధవారం ఇంటర్ పరీక్షలకు కుమారుడు వెళ్లిన తర్వాత తండ్రి స్వామి తన భార్య లక్ష్మిని హత్య చేసి తాను ఉరి వేసుకున్నాడు. గత కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నామని అందుకే చనిపోతున్నట్టు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత ఈ ఘాతుకం చేసుకున్నాడు. ఇంటర్ పరీక్షలు ముగించుకొని ఇంటికి వచ్చిన మల్లికార్జున్ తల్లిదండ్రులు ఇద్దరూ విగత జీవులై ఉండగా రోదించడం అందరినీ కలచివేసింది. సంఘటన స్థలాన్ని నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీష్, పోలీస్ అధికారులు సందర్శించి వివరాలు సేకరించారు. ఐదవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.

స్వామి ఫోన్ నుంచి 14 వాట్సాప్ వాయిస్ మెస్సెజ్ లు . . .

మృతుడు తన ఫోన్ నుంచి 14 వాట్సాప్ వాయిస్ మెస్సెజ్ లను పోస్టు చేశాడు. తన ఏకైక జీవన ఆధారమైన ఆటో నడువడం లేదని, ఆర్థిక పరిస్థితులు కూడా బాగా లేవని అందులో వాపోయాడు. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని అందులో పేర్కొన్నాడు. తన అనంతరం తన ఆస్తులు తన కొడుకుకే చెందాలని అందులో పేర్కొన్నాడు. తన కుటుంబాన్ని పట్టించుకోవాలని మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం వల్ల ఆటో గిరాకీలు లేవని, తన ఆటో చెడిపోయిందని మెస్సెజ్ లో స్వామి వాపోయాడు.

తన కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. తన కొడుకు పరీక్షలు ముగిసిన తర్వాత అతని ఫోన్ కోసం ఎదురు చూసిన స్వామి చివరి క్షణంలో భార్యను చంపి చనిపోతున్నానని తనతో కష్టసుఖాల్లో పాలుపంచుకున్న భార్యను కూడా తీసుకుపోతున్నానని మెస్సెజ్ లో పేర్కొన్నాడు. 14 వాయిస్ మెస్సెజ్ లలో స్వామి కన్నీటిపర్వంతమౌతునే తన కొడుకు మల్లిఖార్జున్ బాగోగులను కుటుంబ సభ్యులకు అప్పజెప్పిన మెస్సెజ్ లు అందరి చేత కన్నీళ్లను తెప్పించాయి.

Advertisement

Next Story

Most Viewed