Farooq Abdullah:వ్యూహాత్మక పొత్తుకు నేషనల్ కాన్ఫరెన్స్ సిద్ధమే

by Shamantha N |
Farooq Abdullah:వ్యూహాత్మక పొత్తుకు నేషనల్ కాన్ఫరెన్స్ సిద్ధమే
X

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. ఎన్నికల ఫలితాల తర్వాత “వ్యూహాత్మక పొత్తు” కు “నేషనల్ కాన్ఫరెన్స్” సిద్దమే అని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్రాభివృద్ధి, అభ్యున్నతి అందరి లక్ష్యం అయినప్పుడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అభ్యంతరం ఏముంది.? ఎందుకు పొత్తు పెట్టుకోకూడదు? అంటూ చెప్పుకొచ్చారు. “ మేమందరం ఎన్నికల్లో ప్రత్యర్థులం కావచ్చు. రాష్ట్రంలో మెరుగైన పరిస్థితుల కోసం పొత్తు పెట్టుకోవడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు.. బహుశా కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవనే అనుకుంటున్నాను. నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదు. నేను చేయాల్సింది చేశాను. నా ముందున్న పని బలమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలన్నదే” అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు.

స్వతంత్రులపైన కన్ను..!

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో స్వతంత్రులను సంప్రదించడంలో తనకెలాంటి అభ్యంతరాలు లేవని ఫరూఖ్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు. కానీ, వాళ్లను బెదిరించి మద్దతు కోరబోమని తేల్చి చెప్పారు. రాష్ట్రాన్ని బలోపేతం చేయాలనే భావన, ఆలోచన వారికుంటే, స్వాగతించేందుకు సిద్దమని అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు వేచి చూస్తామని తెలిపారు. ప్రజల తీర్పు ను బట్టి పొత్తుల గురించి ఆలోచిద్దామని.. అప్పటివరకు ఎలాంటి ఊహాగానాల చేయద్దని అన్నారు. అదే అభిప్రాయాన్ని పీపుల్స్ డమోక్రటిక్ పార్టీ కూడా వ్యక్తం చేసింది. ఇకపోతే, మాజీ సీఎం మహబూబా ముఫ్తీ నేతృత్వంలో పీడీపీ సీట్ల సర్దుబాటు కుదరక ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగింది. సెక్యులర్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని సమర్థించే అంశంపై ఫలితాల తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఇకపోతే, మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Advertisement

Next Story