ఇందిరమ్మ ఇళ్ల కోసం పైరవీలు షురూ..అర్హుల ఎంపిక కోసం మొదలైన సర్వే..

by Aamani |
ఇందిరమ్మ ఇళ్ల కోసం పైరవీలు షురూ..అర్హుల ఎంపిక కోసం మొదలైన సర్వే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రారంభించిన అది తమ స్వలాభం కోసమే మార్చుకుంటున్నారు పైరవీకారులు.. పేద ప్రజల ప్రయోజనమే లక్ష్యంగా ఏ పథకాన్ని అనౌన్స్ చేసినా, అది అమల్లోకి రాకముందే దళారులు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. మీకు అర్హత ఉన్నా , లేకున్నా మేం మీకు పథకంలో లబ్ధి కలిగేలా చేస్తాం..మాకెంతిస్తావ్ అంటూ బేరాలు మాట్లాడేసుకుంటున్నారు. పదేళ్ల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువు దీరిన విషయం తెలిసిందే. ఏడాది పాలన కూడా పూర్తి చేసుకుంది. ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేయనున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టా లెక్కించేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హుల ఎంపిక కోసం అధికారులు సర్వేను కూడా మొదలుపెట్టారు. అర్హుల ఎంపికలో పారదర్శకంగా వ్యవహరిస్తామని, ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం అర్హులనే ఎంపిక చేస్తామని, పైరవీలకు తావివ్వమని అధికారులు, మంత్రులు కూడా చెపుతున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో సీన్ మరోలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ పలువురి వద్ద కొందరు అధికార పార్టీ నాయకులు అడ్వాన్స్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చే రూ.5 లక్షల్లో 20 శాతం కమిషన్ మాట్లాడుకుంటున్నట్టుగా సమాచారం. ఇప్పటికే బాల్కొండ, బోధన్ , నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో కొందరి నుంచి పలువురు పైరవీకారులు, నాయకులు అందిన కాడికి అడ్వాన్స్ డబ్బులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఓ పక్క సర్వే.. మరో పక్క పైరవీలు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం అన్ని నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేసింది. అర్హుల ఎంపిక కోసం అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వే కూడా నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు కూడా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్వేను పరిశీలిస్తున్నారు. ఓపక్క సర్వే జరుగుతుండగానే మరో పక్క గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీకి చెందిన చోటా మోటా నాయకులు, పైరవీకారులు ఇందిరమ్మ ఇళ్ల ఆశావహులకు ఇళ్ల ఆశ చూపి బేరాలు మాట్లాడుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామంటూ పలువురి వద్ద కొందరు అధికార పార్టీ నాయకులు అడ్వాన్స్ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చే రూ.5 లక్షల్లో 20 శాతం కమిషన్ మాట్లాడుకుంటున్నట్లు సమాచారం. సంక్షేమ పథకాల్లో లబ్ది పొందాలన్నా, ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రయోజనం పొందాలన్నా అధికార పార్టీ నియోజకవర్గ ఇంచార్జికే పెత్తనం ఉండటంతో అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లిప్పిస్తామంటూ కొంత మంది నాయకులు ఆశావహులకు నమ్మబలుకుతున్నట్లు చెపుతున్నారు. ఇప్పటికే బాల్కొండ, బోధన్ , నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో కొందరి నుంచి పలువురు పైరవీకారులు, నాయకులు అందిన కాడికి అడ్వాన్స్ డబ్బులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. డబ్బులు ఇచ్చినట్లు కానీ, తీసుకున్నట్లు కానీ ఎలాంటి రాతపూర్వక ఆధారాలు లేకుండా పైరవీకారులు జాగ్రత్తలు పడుతున్నారు.

నియోజకవర్గానికి 2,500 ల ఇళ్లు..

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాలున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి మొదటి విడతలో 2,500 ల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షలు ఇంటి నిర్మాణం కోసం దశల వారీగా ఇస్తామని ప్రకటించింది. మొదటి విడతలో సొంత జాగా ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి రెండో విడతలో సొంత జాగలేని పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించినట్టుగానే ముందుగా సొంత జాగ ఉన్న వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.

నిబంధనలు పక్కాగా అమలైతే పైరవీలు అవసరం లేదు..

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం ప్రభుత్వం రూపొందించిన గైడ్ లైన్స్ పక్కాగా అమలైతే అర్హులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కానీ, రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ నాయకుల జోక్యం, వారి సిఫారసుల ప్రమేయం పెరిగితే మాత్రం పైరవీ కారులదే పైచేయి అవుతుందని, అర్హుల కన్నా అనర్హులకే ఇందిరమ్మ ఇళ్లు అధిక సంఖ్యలో దక్కుతాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం పూర్తిగా బీఆర్ఎస్ నాయకులు, పైరవీకారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అధికారులు ప్రేక్షకపాత్రకే పరిమితమవడం తో చివరకు వారు కూడా పైరవీ కారులతో చేతులు కలిపి భారీగా కమీషన్లలో వాటాలు తీసుకున్నారు. అనర్హులకు పెద్దపీట వేశారు. అర్హులకు పథకంలో చోటు దక్కకుండా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గత ప్రభుత్వం మాదిరిగానే పథకం పక్కదోవ పట్టి అనర్హులకే ఇందిరమ్మ ఇళ్ల ప్రయోజనం దక్కే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి.

రానున్న సర్పంచ్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే..

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం ఇందిరమ్మ ఇళ్లను వారధిగా ఉపయోగించుకునే అవకాశాలపై రాజకీయ నాయకులు కన్నేశారు. ప్రజల నమ్మకంతో పాటు వారి మద్ధతుతో రాజకీయంగా ప్రయోజనం పొందడానికి ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఓ చక్కని అవకాశంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. గ్రామాల్లో అధికంగా ఓటు బ్యాంకున్న వర్గాలను గుర్తించి వారిలో బలమైన వ్యక్తుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ది కలిగిస్తే ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందనే ఆశతో ఆలోచనలకు పదును పెడుతున్నారు.

నిబంధనలు నామ మాత్రమే.. నాయకులదే తుది నిర్ణయం..

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిబంధనలు ఎలా ఉన్నా అధికారుల పాత్ర నామ మాత్రంగా ఉంటుందని, చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంచార్జీలదే తుది నిర్ణయం ఉంటుందని ఓ మండల స్థాయి అధికారి చెప్పడం గమనార్హం. గత ప్రభుత్వ హయాంలో పకడ్బందీగా సర్వే చేసి అసలైన అర్హులను ఎంపిక చేసి లిస్టు తయారు చేస్తే ఆ లిస్టును పక్కన పడేసి ఎమ్మెల్యే ఇచ్చిన లిస్టును చేతి కిచ్చారని అధికారులు అర్హులుగా గుర్తించిన వారు కేవలం 30 శాతం మంది మాత్రమే ఉన్నారని ఆయనన్నారు. ఈ విషయంలో తాను తన అభిప్రాయాన్ని పలువురు పార్టీ నాయకుల వద్ద ఫ్రెండ్లీగా ప్రస్తావిస్తే ఆ విషయాన్ని ఎమ్మెల్యేకు చేరవేసి తనను టార్గెట్ చేసి టార్చర్ పెట్టారని ఆ అధికారి వాపోయారు. ఇప్పుడు అధికారమే మారిందని, అలవాట్లు మారవన్నారు. మళ్లీ అర్హులకు మొండిచేయే ఉంటుందన్నారు. డబ్బులిస్తే అనర్హులు అర్హులుగా చూపిస్తారని, వారిని అర్హుల లిస్టులో చేర్చాలని తమపై ఒత్తిళ్లు తెస్తారని అధికారి అన్నారు. ఒక్కోసారి ఈ డ్యూటీ చేసిన దాని కన్నా చాయ్ హోటల్ నడిపించుకున్నా గౌరవంగా ఉంటుందనే అభిప్రాయం కలుగుతోందన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎలా అమలవుతుందో వేచి చూడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed