- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వకూడదని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. ధాన్యం సేకరణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టరేట్‍లో మంగళవారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తతో కలిసి ఆయా శాఖల అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, రైస్ మిల్లర్లు, ఐకేపీ సీసీలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ దశలోనూ రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ ప్రక్రియ సాఫీగా కొనసాగేలా చూడాలన్నారు.
సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎక్కడైనా అధికారులు, సిబ్బంది తప్పిదాల వల్ల రైతులు ఇబ్బందులు పడినా, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగినా చర్యలు తీసుకుంటామన్నారు. తూకం, తరుగు వంటి అంశాల్లో రైతులకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ధాన్యం సేకరణ ముగిసేంత వరకు పర్యవేక్షణ పకడ్బందీగా కొనసాగించాలని కోరారు. ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో 12 వేల టార్పాలిన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, వారం రోజుల్లో మరిన్ని రానున్నాయని వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతు వివరాలను ఓపీఎంఎస్ లో నమోదు చేయాలన్నారు. వాతావరణ పరిస్థితులను రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు.
గతేడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్ లో ఎక్కువ సాగు
వరి సాగులో గతేడాదితో పోలిస్తే ఈసారి 60 శాతం ఎక్కువ ధాన్యం సేకరించాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. సన్న రకం, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్ల కోసం వేర్వేరుగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఈసారి అదనంగా 150 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. ప్రతి కేంద్రంలో తప్పనిసరిగా వేయింగ్ మెషిన్, ఆన్లైన్ లో వివరాల నమోదు కు టాబ్ లు సమకూర్చుకోవాలని సూచించారు. తాగునీటి వసతి కల్పించాలన్నారు. సరిపడా హమాలీలను ఏర్పాటు చేయాలన్నారు.
కొనుగోలు చేసిన వెంటనే నిర్దేశిత రైస్ మిల్లులకు ధాన్యాన్ని పంపించాలన్నారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాళ్‌కు రూ. 500 బోనస్ చెల్లించనున్నందున ధాన్యం సేకరించే సమయంలో ప్రైవేట్ వ్యక్తుల నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మిల్లులకు ధాన్యం నిల్వలు పంపించడానికి ముందు బస్తాలపై రకం, కొనుగోలు కేంద్రం కోడ్ నెంబర్ వివరాలను తప్పనిసరి రాయాలని సూచించారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, డీఎస్ఓ అరవింద్ రెడ్డి, డీసీఓ శ్రీనివాస్, సివిల్ సప్లైస్ డీఎం రమేష్, జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.