ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు

by Sridhar Babu |
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు
X

దిశ, నిజామాబాద్ సిటీ : యాసంగిలో జిల్లా రైతాంగం పండించిన వరి ధాన్యం సేకరణ కోసం త్వరలోనే అవసరమైన అన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులు, సిబ్బందిని సన్నద్ధం చేశామని అన్నారు. యాసంగి సీజన్ లో జిల్లాలో వరి సాగు సాధారణ విస్తీర్ణం లక్షా 13967 హెక్టార్లు కాగా, ఈసారి సాధారణానికి మించి లక్షా 66761 హెక్టార్లలో సాగు చేశారని వివరించారు. 11.72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి చేతికందుతుందని అంచనా కాగా, అందులో 7.57 లక్షల మెట్రిక్ టన్నుల వరకు గంగా కావేరి, ఇతర సన్న రకాలు ఉన్నాయన్నారు.

సుమారు 4.15 లక్షల మెట్రిక్ టన్నుల మేర దొడ్డురకం ధాన్యం నిల్వలు చేతికందుతాయన్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చిన పలువురు వ్యాపారులతో పాటు కొందరు స్థానిక వ్యాపారులు సైతం ఆయా ప్రాంతాలలో రైతులను నేరుగా కలిసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. అదేవిధంగా స్థానిక అవసరాల కోసం కొందరు రైతులు కూడా తాము పండించిన పంట నుండి కొంత మొత్తాన్ని అట్టిపెట్టుకోవడం జరుగుతుందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఈసారి జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ వెల్లడించారు.

ధాన్యం సేకరణ కోసం మొత్తం 462 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. వీటిలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 417 కేంద్రాలు పని చేయనుండగా, ఐకేపీ ద్వారా 39 , మెప్మా ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయని వివరించారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి, ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిస్థాయిలో మద్దతు ధర పొందాలని కలెక్టర్ కోరారు. కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం 'ఏ' గ్రేడ్ రకానికి క్వింటాలుకు రూ. 2203, సాధారణ రకానికి రూ. 2183 ధర చెల్లించనున్నట్టు తెలిపారు. త్వరలోనే అందుబాటులోకి రానున్న కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా కొనుగోలు కేంద్రాలలో రైతులకు మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed