రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చేసిన సీఎం కేసీఆర్..

by Sumithra |
రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చేసిన సీఎం కేసీఆర్..
X

దిశ, కామారెడ్డి రూరల్ : మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణను సీఎం కేసీఆర్ అప్పుల తెలంగాణగా మార్చారని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అన్నారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హాత్ సే హాత్ జోడో యాత్రలో ప్రజలు అనేక సమస్యలు తమదృష్టికి తెస్తున్నారన్నారు. రేషన్ కూడా సరైన సమయంలో ఇవ్వడం లేదని ప్రజలు చెప్తున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం 4250 కోట్ల బకాయి ఉందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు జీఎస్టీ, వ్యాట్ పేరుతో పేదల నడ్డి విరుస్తున్నారన్నారు.

ప్రజలు ఏది కొనుక్కునే పరిస్థితి లేదన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ లేదని, ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదని, ఆరోగ్య శ్రీ అయితే అసలే లేదన్నారు. దళిత సీఎం హామీ పోయిందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. పోలీసులు పొలిటికల్ ఏజంట్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని బంద్ చేసినా మద్యం మాత్రం బంద్ చేయడం లేదని, దాని ద్వారా రెవిన్యూ సమకూర్చుకుంటున్నారని తెలిపారు. తాము చేపట్టిన యాత్రలో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కడతామని చెప్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందన్నారు.

రాష్ట్రంలో ఇందిరమ్మ గృహాలు మాత్రమే ఉన్నాయని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ లేవన్నారు. ఇందిరమ్మ ఇండ్లు లేని చోట ఓట్లు అడగమని పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని, ఈ విషయాన్ని బుధవారం నుంచి మహిళా కాంగ్రెస్ నేతలు ఇంటింటికి తీసుకెళ్తారన్నారు. ప్రజలు తమకు ఓటు ఎందుకు వేయాలో వివరిస్తారని పేర్కొన్నారు. సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు, పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed