శ్రీధర్​ కుటుంబాన్ని ఆదుకోవాలి

by Sridhar Babu |
శ్రీధర్​ కుటుంబాన్ని ఆదుకోవాలి
X

దిశ, భిక్కనూరు : ఆటోలు నడవక... నెలనెలా చెల్లించాల్సిన కిస్తీలు, ఫైనాన్స్ బాకీలు సరిగా కట్టలేక, పెరిగిన అప్పులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భిక్కనూరు మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఆటో వాలాలు రోడ్డెక్కారు. స్థానిక సినిమా టాకీస్ చౌరస్తా వద్ద రోడ్డుపై నిలబడి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ తుమ్మ శ్రీధర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటం ఎదుట రెండు నిమిషాలు మౌనం పాటించి, కొవ్వొత్తులతో నివాళులర్పించారు.

అనంతరం ఆటో డ్రైవర్ల సంఘం మండల శాఖ అధ్యక్షులు బసగళ్ల సిద్ధరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ జర్నీ పథకంతో, తమ ఆటోలు నడవక ఉపాధి కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఏదో ఒకచోట ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న శ్రీధర్ కుటుంబాన్ని ఆదుకొని, ఆటో వాలాలకు నెలకు 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో సంఘం యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed