కొనుగోళ్లలో ఇంత నిర్లక్ష్యమా

by Sridhar Babu |
కొనుగోళ్లలో ఇంత నిర్లక్ష్యమా
X

దిశ, భిక్కనూరు : మాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇంత అధ్వానంగా ధాన్యం కొనుగోలు చేయడం ఎన్నడూ చూడలేదని, నెలన్నర రోజులు అవుతున్నా... ధాన్యం కాంటా చేయరా అంటూ రైతులు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఎండకు ఎండి వానకు నాని పోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ సొసైటీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో శుక్రవారం డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డిని పట్టుకొని బార్ధన్ కొరత ఉందని ధాన్యం కొనుగోలు చేయరా... ఇంకెన్ని రోజులు రైతుల ఉసురు పోసుకుంటారంటూ నిలదీశారు. రాత్రి, పగలు

తేడా లేకుండా ఇక్కడే కాపలా కాస్తున్నామని, ఇంకెన్ని రోజులు వేచి చూడాలని, ఇంత దుర్మార్గమైన పాలన ఇప్పుడే చూస్తున్నామంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. గత పది ఏళ్లలో ఎప్పుడూ కూడా ధాన్యం నానిన దాఖలాలు లేవని, ధాన్యం నాన కుండా, కాంటా అయిన ధాన్యాన్ని సినిమా టాకీస్ తో పాటు, ఖాళీగా ఉన్న భవనాలలో నిల్వ ఉంచేదన్నారు. అటువంటిది ఈ ప్రభుత్వ పాలనలో మొత్తం నిర్లక్ష్యమే కనబడుతుందంటూ మండిపడ్డారు. అకాల వర్షాలతో ధాన్యం తడుస్తున్నా జిల్లా యంత్రాంగం పట్టి పట్టనట్లు వ్యవహరించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొనుగోళ్లు ప్రారంభించి నెలన్నర రోజులు....

ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి నెలన్నర రోజులు అవుతుందని, డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై దిశ ఆయనతో మాట్లాడగా అకాల వర్షం వల్ల ధాన్యం తడిసిపోయిందన్నారు. కొనుగోళ్లలో ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదని, సాధ్యమైనంతవరకు లిఫ్ట్ చేసి రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. వారం పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే విధంగా అధికారులతో మాట్లాడామని ఆయన వివరించారు.

Advertisement

Next Story

Most Viewed