ఆస్తి కోసం ఆరు హత్యలు

by Sridhar Babu |
ఆస్తి కోసం ఆరు హత్యలు
X

దిశ, కామారెడ్డి : ఆస్తి కోసం ఆరుగురు హత్యకు గురయ్యారని కామారెడ్డి జిల్లా ఎస్పీ సిందూశర్మ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సిందూశర్మ ఆరు హత్యలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ గ్రామానికి చెందిన మేడిద ప్రశాంత్, పూనే ప్రసాద్ ఇద్దరూ స్నేహితులు. అయితే 2018 లో ప్రసాద్ అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషయంలో పోలీసులు కేసు నమోదు చేయడంతో ప్రసాద్ దుబాయ్ పారిపోయాడు. అప్పటి నుంచి ఆ కేసు పెండింగులో ఉంది. దుబాయ్ వెళ్లిన ప్రసాద్ అప్పుడప్పుడు గ్రామానికి సంబంధించిన విషయాలు, కేసు వివరాలపై ఫోన్ చేసి మాట్లాడేవాడు. 2022 డిసెంబర్ నెలలో తిరిగి వచ్చిన ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అంతకుముందు దుబాయిలో ఉన్నప్పుడు తన స్నేహితుడు ప్రశాంత్ కు మూడున్నర లక్షలు అప్పుగా ఇచ్చాడు.

జైలు నుంచి బయటకు వచ్చిన ప్రసాద్ ను మాక్లూర్ గ్రామం నుంచి బహిష్కరించారు. దాంతో ప్రసాద్ తన భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు, తల్లితో కలిసి కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో ఉంటున్నారు. ప్రసాద్ జైలులో ఉండటం, సొంత గ్రామంలో ఉండకపోవడంతో అప్పులు ఎక్కువ కావడంతో తనకు ఇవ్వాల్సిన మూడున్నర లక్షలు ఇవ్వాల్సిందిగా ప్రశాంత్ ను అడిగాడు. అయితే రేపుమాపు అంటూ ప్రశాంత్ కాలయాపన చేయడంతో ఊర్లో ఉన్న ఇంటిని, స్థలాన్ని అమ్మడానికి, కుదువపెట్టడానికి ప్రయత్నించినా ఫలితం లభించలేదు. ఇదే విషయమై ప్రశాంత్ ను సంప్రదించగా మార్ట్ గేజ్ చేసుకుని లోన్ ఇస్తారని, తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే లోన్ ఇప్పిస్తానని నమ్మించాడు.

దాంతో గత మే నెలలో ప్రశాంత్ పేరుమీద 25 లక్షల విలువ చేసే ఇల్లు, స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిచ్చాడు. అయినా లోన్ ఇప్పించకుండా కాలయాపన చేయ సాగాడు. దాంతో డబ్బుల కోసం ప్రసాద్ నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో ప్రసాద్ ఆస్తిపై కన్నేసిన ప్రశాంత్ డబ్బులు ఇవ్వకుండా సాగదీసాడు. ప్రసాద్ ను ఎలాగో ఊర్లోకి రానివ్వడం లేదని, అతన్ని చంపినా అడిగేవారు లేకపోవడంతో హత్యకు ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని తనకి పరిచయం ఉన్న దుర్గానగర్ కు చెందిన బానోత్ వంశీ, గుగ్లోత్ విష్ణులకు చెప్పాడు. దీనికోసం వారికి 60 వేలకు ఒప్పందం చేసుకున్నాడు.

హత్యలు చేసింది ఇలా....

గత నెల 29 న నిజామాబాద్ లో ఓ కారును రోజువారీ అద్దెకు తీసుకుని ప్రసాద్ ను తీసుకుని మాక్లూర్ వెళ్లారు. వెంట తెచ్చుకున్న మద్యాన్ని ప్రసాద్ కు తగ్గించి కర్రలతో కొట్టి చంపేసి గ్రామంలోకి వెళ్లి పార, గడ్డపార తెచ్చి అడవిలో గొయ్యి తవ్వి పాతిపెట్టారు. విషయం తెలిస్తే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారని భావించిన ప్రశాంత్ అదే కారులో ఈ నెల 1 న పాల్వంచ వెళ్లి ఊర్లో కేసు ఉందని ప్రసాద్ ఒకచోట దాక్కున్నాడని, అక్కడికి తీసుకువెళ్తామని చెప్పి ప్రసాద్ భార్య శాన్విక, చెల్లెలు శ్రావణిని తీసుకుని నిజామాబాద్ వెళ్లాడు. శ్రావణిని ఒకచోట ఉంచి ప్రసాద్ వద్దకు తీసుకెళ్తానని మరొక ఇద్దరితో కలిసి శాన్వికను కారులో బాసర వైపు తీసుకెళ్లి గొంతుకు తాడు బిగించి చంపేసి మృతదేహాన్ని బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడేశారు. సాయంత్రం శ్రావణి వద్దకు వచ్చి

శాన్వికను ప్రసాద్ వద్ద వదిలిపెట్టామని చెప్పి ఇక్కడి నుంచి వెళ్లిపోదామని శ్రావణిని తీసుకుని కారులో మెదక్ జిల్లా చేగుంట వైపు వెళ్లి శాన్విక మాదిరిగానే శ్రావణి గొంతు తాడుతో బిగించి చంపి చేగుంట మండలం వడియారం శివారులో జాతీయ రహదారి పక్కన మృతదేహాన్ని తగలబెట్టి మాక్లూర్ వెళ్లిపోయారు. తర్వాత తల్లి సుశీల, మరో చెల్లెలు స్వప్న, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కవలలు చైత్రిక, చైత్రిక్ లను ఇక్కడ ఉంటే పోలీసులు వచ్చి పాత కేసు విషయంలో తీసుకెళ్లే ప్రమాదం ఉందని ప్రసాద్, శాన్విక, శ్రావణి నిజామాబాదులో ఉన్నారని చెప్పి వీరిని కూడా నిజామాబాద్ తీసుకెళ్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అన్నపూర్ణ లాడ్జిలో ఉంచారు. ఈ విషయాలన్నీ ప్రశాంత్ తన తల్లికి చెప్పి సహకరించాలని కోరగా ఆమె కూడా ఈ హత్యలకు సహకరించింది. ఈ నెల 4 న ప్రసాద్ తన పిల్లలను చూడాలంటున్నాడని

చెప్పి ప్రశాంత్ తన తల్లి వడ్డెమ్మను వారికి కాపలాగా ఉంచి పిల్లలను తీసుకుని నిజామాబాద్ నుంచి సొన్ బ్రిడ్జి వైపు తీసుకెళ్లి ఇద్దరు పిల్లల గొంతు నులిమి హత్య చేసి గోనె సంచులలో ఇద్దరిని కట్టి బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడేసి వెళ్లిపోయారు. అలాగే ఈ నెల 13 న ప్రసాద్ చెల్లెలు స్వప్నను భూంపల్లి శివారులో గొంతునులిమి చంపేసి రోడ్డుపక్కన పడేసి పెట్రోల్ తో తగలబెట్టి వెళ్లిపోయారు. ప్రసాద్​ తల్లి సుశీలకు అందరూ బాగానే ఉన్నారని మాయమాటలు చెప్పి నమ్మిస్తూ ఆమెను కూడా చంపితే ఇంక ఎవరూ మిగిలి ఉండరని భావించారు. అయితే సుశీల వారి నుంచి తప్పించుకుని వెళ్లిపోయింది. ఆమె పాల్వంచలో ఉంటుందని భావించిన నిందితులు పాల్వంచకు వస్తుండగా గాంధారి ఎక్స్ రోడ్ వద్ద వారిని పట్టుకున్నట్టు ఎస్పీ వెల్లడించారు. భూంపల్లి శివారులో దొరికిన మహిళ మృతదేహం

విషయంలో ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసి సుమారు 50 నుంచి 60 సీసీ కెమెరాలు పరిశీలించి టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించి కేసులో ఆధారాలు సేకరించినట్టు తెలిపారు. అయితే ప్రసాద్, అతని భార్య శాన్విక మృతదేహాలు ఇంకా లభించలేదని, వాటికోసం నిందితులను తీసుకెళ్లి విచారణ చేస్తామని పేర్కొన్నారు. బాసర పోలీసులకు సమాచారం అందించి గోదావరి నదిలో శాన్విక మృతదేహం విషయాన్ని గుర్తిస్తామని, మాక్లూర్ సమీపంలో తహసీల్దార్ సమక్షంలో ప్రసాద్ మృతదేహం వెతుకుతామన్నారు. ఏ1 నిందితుడు ప్రశాంత్ తో పాటు అతని మైనర్ సోదరుడు, గుగ్లోత్​ విష్ణు, బానోత్ వంశీ, వడ్డెమ్మలను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. వీరి నుంచి కారు, ఒక బైక్, ల్యాండ్ రిజిస్టర్ డాక్యుమెంట్స్, 30 వేల నగదు, 5 మొబైల్ ఫోన్లు, ఒక తాడు, 2 పెట్రోల్ బాటిళ్లు, ఒక బంగారు పుస్తె, ఒక పార, గడ్డపార, రోల్డ్ గోల్డ్ నల్లపూస దండ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కేసు ఛేదించడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story