మంజీరా మౌన రోదన.. అక్రమ ఇసుక రవాణా

by Mahesh |
మంజీరా మౌన రోదన.. అక్రమ ఇసుక రవాణా
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇసుక అక్రమ ర‌వాణాతో మంజీరా మౌన రోదనకు గుర‌వుతోంది. ఒక‌టి కాదు రెండు కాదు రోజుకు వంద‌ల లారీల్లో ఇసుక‌ను అక్రమంగా రాష్ట్ర స‌రిహ‌ద్దు దాటిస్తున్నారు. ప్రభుత్వం మారినా ఈ అక్రమ ర‌వాణా ఆగ‌డం లేదు. ఫ‌లితంగా ఇసుకాస‌రులు రోజుకు ల‌క్షల్లో ప్రభుత్వానికి ద‌క్కాల్సిన సొమ్మును జేబులో నింపుకుంటున్నారు. ఇసుక మాఫియాతో కొంత‌మంది అధికారులు కుమ్మక్కు కావ‌డంతో జోరుగా దందా కొన‌సాగుతోంది. గ‌తంలో అధికార బీఆర్ఎస్ నాయ‌కుల అండ‌తో య‌థేచ్ఛగా ఈ దందా సాగింది. కానీ ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ ఓట‌మి పాల‌య్యింది. కానీ ఇసుక మాఫియాలో త‌మ‌కున్న ప‌ట్టుతో ఇంకా దందా కొన‌సాగిస్తున్నారు. జిల్లాలో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.

జిల్లాలో గోదావరి, మంజీరా నదుల పరివాహక ప్రాంతం ఉంది. గత ప్రభుత్వ హయాంలో మంజీరా పరివాహక ప్రాంతంలో మాత్రమే ఇసుక తవ్వకానికి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చింది. వర్షాలకు పరివాహక ప్రాంతాల్లో ఇసుక మేటల వద్ద దానిని తగ్గించుకునేందుకు చెక్ డ్యాంల వద్ద ఇసుక మేటలను తొలగించేందుకు మాత్రమే అనుమతిచ్చింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక రీచ్ లకు, తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదు. నిజామాబాద్ జిల్లాలో మంజీరా పరివాహక ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జోరందుకున్నాయి. ప్రధానంగా రాత్రనక, పగలనక ఇసుకను తోడేస్తున్నారు. ప్రభుత్వం చొర‌వ తీసుకుని అక్రమ ఇసుక ర‌వాణా అడ్డుకోవాలని ప్రజ‌లు కోరుతున్నారు.

నిజామాబాద్ జిల్లా కోటగిరి, బోధన్, సాలూర మండలాల్లో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజలు ప్రభుత్వ అవసరాల కోసం తహసీల్దారు లకు వే బిల్లుల ద్వారా ఇసుకను ట్రాక్టర్‌లలో తవ్వేందుకు అనుమతులు ఇవ్వగా దానిని కూడా అక్రమార్కులు ఉపయోగించుకుని ఇసుకను తవ్వేస్తున్నారు. నిజామాబాద్, మహారాష్ట్రకు సరిహద్దుల్లోని కొత్త మండలంలోని మందర్నా, తగ్గాలి, హున్సాలో ఈ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. వే బిల్లులు తీసుకున్నవి పట్టపగలే ట్రాక్టర్లతో మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉండగా టిప్పర్లను, యంత్రాలను పెట్టి తరలిస్తున్నారు. ప్రధానంగా ఇసుక మేటలు లేకపోయినప్పటికి రైతుల పట్టా భూముల్లో ఉన్న ఇసుకను తవ్వే ప్రక్రియ నిరంతరంగా సాగుతుంది. దానికి స్థానిక రెవెన్యూ అధికారుల అండదండలు ఉన్నాయని విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కొత్తగా ఏర్పడిన సాలూర మండలం లో ఇసుక తవ్వకాలకు సంబంధించిన వే బిల్లు ప్రైవేటు వ్యక్తుల వద్ద ఉండడం విశేషం. అధికారులు తనిఖీ చేసినప్పుడు మాత్రమే వే బిల్లులు చూపుతున్నారు. రాత్రివేళ తవ్వకాలకు ఎలాంటి అనుమతులు వే బిల్లులు లేకుండా జరుగుతుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి మంజీరా నుంచి ఇసుక తవ్వకాలు రవాణా జరుగుతుంది. కోటగిరి, బోధన్, సాలూర మండలాల్లో తవ్వకాలు జరిపి జిల్లా కేంద్రానికి తరలిస్తున్నారు. ఒక్కొక్క టిప్పర్ కి మామూళ్లు వసూలు చేస్తూ స్థానిక రెవెన్యూ, పోలీసు అధికారులకు అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో కొందరు రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు స్థానికంగా ఇసుక తవ్వకాల సందర్భంగా వాహనాలను సమకూర్చుకుని రవాణాలో పాలుపంచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈసారి అలా కాకుండా సంబంధిత ఏరియా వారీగా వెళ్లే పోలీస్ స్టేషన్ అధికారులను మచ్చిక చేసుకుని ఇసుకను రాత్రికి రాత్రి తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వారికి రెవెన్యూ అధికారులు ఇచ్చచే పగటి పూట వే బిల్లులను సాకుగా చూపుతున్నారు. ఇదే తంతు ఇసుక తవ్వకాలు, రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. తాజాగా జరుగుతున్న తవ్వకాల గురించి కొందరు జిల్లా అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా అక్కడ ఇసుక మాఫియాలో ఉన్న వారు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉండడంతో ఇసుక తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. వారం రోజుల క్రితం నిజామాబాద్ కు చెందిన ఇసుక సప్లై అసోసియేషన్ ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మూడు టిప్పర్లను సీజ్ చేశారు. తర్వాత మాత్రం ఐదు రోజులు మాత్రమే తవ్వకాలకు అనుమతి తీసుకున్న వారు వారం రోజులు తవ్వకాలు చేయడం కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ పనుల కోసమని పెద్ద టిప్పర్లతో (తాజ్) తరలిస్తూ అమ్ముకునే ప్రక్రియ కొనసాగుతుంది. ఇసుకను ట్రాక్టర్ల ద్వారా మంజీరా నుంచి తవ్వుకుని వచ్చి గ్రామాలలో డంప్ చేసి అక్కడి నుంచి జిల్లా కేంద్రానికి తరలించే ప్రక్రియ నిత్యం జరుగుతుంది. ఈ విషయంపై జిల్లా మైనింగ్ శాఖ సహాయ సంచాలకులు వివరణ కోరగా స్థానికంగా అవసరాల కోసం రెవెన్యూ అధికారులు వే బిల్లులు తీసుకున్నారు అంతకు మించి ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణాకు అనుమతులు లేవని పేర్కొన్నారు.

Advertisement

Next Story