మావోయిస్టుల ఇలాకకు బస్సు సర్వీస్.. ఆనందంలో విద్యార్థులు

by Mahesh |
మావోయిస్టుల ఇలాకకు బస్సు సర్వీస్.. ఆనందంలో విద్యార్థులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: భీంగల్ మండలం రహాత్ నగర్ గిరిజన గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును అధికారులు బుధవారం ప్రారంభించారు. చుట్టూ గుట్టలు, కొండలు, పచ్చని వృక్ష సంపదతో ఆహ్లాదకరంగా ఉండే రహత్ నగర్ గ్రామం ఒకప్పుడు మావోయిస్టు ప్రాబల్య గ్రామం. ఇక్కడి గిరిజనులు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవితం గడిపేవారు. రోడ్లు కూడా సరిగా ఉండేవి కావు. కానీ, అప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ప్రశాంతతకు పల్లె తనానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంది. గతుకుల రోడ్డు బీటీ రోడ్లుగా మారాయి. కానీ, ప్రయాణ, రవాణా సౌకర్యాలు మాత్రం ఈ రూట్లో మెరుగుపడలేదు. దీంతో భీంగల్, ఆర్మూర్‌లలో చదివే విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఎట్టకేలకు గ్రామస్థుల మొరను ఆలకించిన ఆర్మూర్ డిపో మేనేజర్ రవి కుమార్ విద్యార్థుల సౌకర్యార్థం భీంగల్ నుండి పురాణి పేట, పల్లికొండ గ్రామాల మీదుగా రహత్ నగర్ కు బస్సు సర్వీసును ప్రారంభించారు. ఉదయం రహత్ నగర్ నుండి భీంగల్‌కు ఒక ట్రిప్పు, తరవాత భీంగల్ నుంచి రహత్ నగర్ కు మరో ట్రిప్పు నడపనున్నట్లు డీఎం రవి కుమార్ తెలిపారు. ఆయా గ్రామాల ప్రజల అభ్యర్ధన మేరకు రూట్ సర్వే జరిపి బస్సు సర్వీసును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రహత్ నగర్ గ్రామ పెద్దలు, యువకులు, పిల్లలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed