అకాల వర్షానికి తడిసిన ధాన్యం.. రోడ్డెక్కిన రైతులు

by Anjali |
అకాల వర్షానికి తడిసిన ధాన్యం..  రోడ్డెక్కిన రైతులు
X

దిశ, నిజాంసాగర్: కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలం కోమలంచ గ్రామంలో అధికారులపై అన్నదాతలు కన్నెర్ర చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు జాప్యం చేశారని, వర్షానికి వరి ధాన్యం తడిచిపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు రాస్తా రోకో, ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని కొమ్మలంచ గ్రామంలో గత ఐదు రోజులుగా వరి ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయనీ, ఇప్పటికే రెండు లారీల ధాన్యం తూకం వేసి రైస్ మిల్లులకు తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరుని నిరసిస్తూ బుధవారం కొమలంచ గేటు వద్ద, మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు రాస్తా రోకో నిర్వహించడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి వాహదారులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న బాన్సువాడ రూరల్ సీఐ సత్యనారాయణ, నిజాంసాగర్ ఎస్ఐ కె.సుధాకర్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు.

ఇప్పటికే తూకం వేసిన రెండు వేల బస్తాలు రెండు సార్లు వర్షానికి తడిచాయని రైతులు అవేదన వ్యక్తం చేశారు. సుమారు 80 లారీల ధాన్యం ఉండగా కేవలం 38 లారీల ధాన్యం కొనుగోలు చేసి ధాన్యం రైస్ మిల్లులకు తరలించారని, అందులోనూ క్వింటాలుకు 5 కేజీల వరి ధాన్యం తరుగు పేరిట రైతులను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా సుతిలీ డబ్బులను రైతుల వద్ద ముక్కుపిండి వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గున్కుల్ సహకార సంఘం పరిదిలో సుమారు 12 వందల ఎకరాలు సాగు భూమి ఉందని భారీగా వరి ధాన్యం దిగుబడి వచ్చే కొమ్మలంచ గ్రామ శివారులో వరి కొనుగోలు కేంద్రాలను పెంచి ధాన్యం తడవకుండా రైతులను ఆదుకోవాలని కోరారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించినప్పటి నుండి ఒక్క సారి కూడా తహశీల్దార్, పై అధికారులు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించక పోవడంతోనే ధాన్యం కొనుగోలు, తరలింపునకు జాప్యం ఏర్పడిందని రైతులు తహశీల్దార్ క్రాంతి కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో రైతులు తమ బాధను చెప్పుకోవడానికి సంబంధిత అధికారులు వచ్చే వరకు ధర్నా విరమించమని చెప్పడంతో మహమ్మద్ నగర్ మండల తహశీల్దార్ క్రాంతి కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడుతూ.. లారీల కొరతతో ధాన్యం తరలింపుకు జాప్యం ఏర్పడిందని అన్నారు. మేము ధర్నా చేస్తే కానీ మా బాధలు తెలియలేవు కదా అని రైతులు తహశీల్దార్ క్రాంతి కుమార్ పై మండిపడ్డారు రైతులు. ఇప్పటి నుండి కొనుగోలు పెంచి లారీల కొరత లేకుండా ధాన్యం తరలింపులో వేగవంతం చేస్తామని హామీ నిచ్చారు. గున్కుల్ సహకార సంఘం పరిధిలో ఇప్పటి వరకు 72 వేల క్వింటాలు వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు వేగం పెంచి,లారీలను మళ్లించి ధాన్యం తరలింపు ప్రక్రియ వేగవంతం చేస్తామని, వరి ధాన్యం తడవకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో రైతులు సాధుల సత్యనారాయణ, గంగారెడ్డి, జైపాల్, విఠల్ గౌడ్, పండరి, రవి గౌడ్, బాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed