రాజకీయ పార్టీలు బూత్​ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి

by Sridhar Babu |
రాజకీయ పార్టీలు బూత్​ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలి
X

దిశ, కామారెడ్డి : రాజకీయ పార్టీలు బూత్​ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. కామారెడ్డి కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న గ్రామాలలో కొత్తగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేశామని చెప్పారు. కొన్నిచోట్ల ఒకే చోట మూడు పోలింగ్ కేంద్రాలు ఉండటం వల్ల ఓటర్లు ఇబ్బంది పడినట్లు సాధారణ ఎన్నికల్లో తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వాటిని పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, పంచాయతీ భవనాల్లోకి మార్చే విధంగా ప్రతిపాదనలు తయారు చేసినట్లు చెప్పారు.

రాజకీయ పార్టీల ఏజెంట్లు, ప్రజలు ఓటర్ల జాబితా పై అభ్యంతరాలు ఉంటే ఫారం 8 ద్వారా బూత్ లెవెల్ అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. మృతి చెందిన వ్యక్తుల పేర్లు ఓటర్ జాబితాలో ఉంటే, వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొని వాటిని తొలగించాలని చెప్పారు. రెండు చోట్ల ఒక వ్యక్తికి ఓటు ఉంటే వాటిలో ఒక దానిని తొలగించుకునే విధంగా చూడాలన్నారు. నియోజకవర్గాల వారీగా మార్పులు చేయవలసిన పోలింగ్ కేంద్రాలపై చర్చించారు. జనవరి 6న డ్రాప్ట్ రోల్ పబ్లిష్ అవుతుందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు జాబితాలో ఎలాంటి తప్పులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరిస్తామని చెప్పారు. వారి ఓట్లు ఒకే చోట ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు అనిల్ కుమార్, రాజకీయ పార్టీల ప్రతినిధులు నరేందర్, కాసీం అలీ, బాలరాజు పాల్గొన్నారు.

Advertisement

Next Story