లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన బోగస్ కంపెనీలు

by Sumithra |
లక్షలు వసూలు చేసి బోర్డు తిప్పేసిన బోగస్ కంపెనీలు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పేరుకు పెద్ద చిట్ ఫండ్ కంపెనీలు అందులో చిట్టిలు వేసే వరకు అందరినీ ఆఫర్లతో ఊరిస్తాయి. కానీ అందులో చేరి ప్రతి నెల డబ్బులు చెల్లించిన వారికి చిట్టి డబ్బులు ఇవ్వాలంటే మాత్రం చుక్కలు చూపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పేరు మోసిన చిట్ ఫండ్ కంపెనీలపై చిట్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు కేసులు నమోదు చేస్తున్నా నిర్వాహకుల తీరులో మార్పు రావడం లేదు. దాంతో ఎన్నో ఆశలతో రూపాయి రూపాయి కూడబెట్టి చిట్టీలు వేసిన సామాన్యులు సమిధలవుతున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిట్ ఫండ్స్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఏజెంట్లకు భారీ కమీషన్లు ఇస్తూ అమాయకులకు గాలం వేసి చిట్టీలు వేయించుకుంటున్నారు. డబ్బులు కట్టించే వరకే కనిపిస్తున్న ఏజెంట్లు.. చిట్టి వస్తే ఇప్పించేందుకు ముందుకు రావడం లేదని బాధితులు వాపోతున్నారు. నెలల తరబడి చిట్టి చెల్లింపులకు కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు. కంపెనీల బాధితులు ఎదురుచూపులు చూస్తున్నారు. బాధితులు ఫిర్యాదులు చేసినా అధికారులు కంపెనీల మోసాలను అరికట్టలేకపోతున్నారని బాధితులు వాపోతున్నారు.

సొంత ఇళ్లు కట్టుకుందామనో.. బిడ్డ పెళ్లి చెద్దామనో.. పిల్లల చదువులకు ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా చూసుకుందామనో.. ఎన్నో ఆశలతో చిట్ ఫండ్ కంపెనీలలో నమ్మిన వారు ఏజెంట్లుగా ఉన్నారని డబ్బులు చెల్లిస్తే సదరు కంపెనీలు మోసం చేయడంతో ఎందరో ఆర్థిక ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఉన్నాయి. నెలవారి చీటీల పేరుతో పల్లె, పట్టణాల్లోని ప్రజలకు ఏజెంట్ల ద్వారా అమాయకులకు గాలం వేస్తున్నారు. తీరా డబ్బులు కట్టే వరకే ఏజెంట్లు కనిపిస్తుండగా చీటి లేపిన తర్వాత మాత్రం ఇప్పించేందుకు రాకపోవడం, కొందరు ఏజెంట్లు తమను నమ్మి డబ్బులు కట్టారని ఎంతో కొంత మానవత్వం చూపిస్తున్నారని కార్యాలయానికి వస్తే సదరు కంపెనీ నిర్వాహకులు కనిపించకుండా దాగుడు మూతలు ఆడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చీటి డబ్బులు ఇవ్వడం లేదని ఏజెంట్ ఆగ్రహo వ్యక్తం చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని భవిత శ్రీ చిట్ ఫండ్ కంపెనీలో పని చేస్తున్న ఓఏజెంట్ తన తరఫున సుమారు 200 మంది సభ్యులను కంపెనీలో చేర్పించి చీటీ డబ్బులను అందిస్తున్నాడు. అయితే గత 14 నెలలుగా చీటీలు ఎత్తిన వారికి డబ్బులు ఇవ్వడానికి చిట్ ఫండ్ మేనేజర్ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించాడు. కొన్ని రోజుల క్రితం డబ్బులు కట్టిన బాధితులు తన ఇంటికి వచ్చి నానా హంగామా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లకు ఇవ్వాల్సిన చీటీలో తనకు రావాల్సిన కమీషన్ తీసుకుని ఇవ్వాలని మేనేజర్ ను కోరినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. చీటి డబ్బులు చెల్లించిన బాధితులు తన ఇంటిచుట్టు తిరుగుతున్నారని, కంపెనీ వాళ్లు డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు.

జిల్లా కేంద్రంలో రోజుకో చోట చిట్ ఫండ్ కంపెనీల మోసాలు, లీలలు బయట పడుతున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోజుకో చోట చిట్ ఫండ్ కంపెనీల లీలలు బట్టబయలు అవుతున్నాయి. వ్యాపార, వాణిజ్యపరంగా అన్ని రకాలుగా జిల్లా కేంద్రం అభివృద్ధి చెందుతుండడంతో పుట్టగొడుగుల్లా చిట్ ఫండ్ కంపెనీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త బస్టాండ్ నుంచి హౌజింగ్ బోర్డు కాలనీ వరకు ఏర్పాటు చేసిన కొన్ని చిట్ ఫండ్ కంపెనీలపై డబ్బులు కట్టించుకొని మోసగిస్తున్నారని ఫిర్యాదులు కొకొల్లాలుగా వస్తున్నాయి.

కొందరు లోలోపల సర్దుబాటు చేసుకుంటుండగా మరికొందరు దౌర్జన్యాలు చేయడం, మధ్యవర్తులతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పదుల సంఖ్యలోనే రోజుకో చిట్ ఫండ్ లపై ఫిర్యాదులు వచ్చినా వాటిపై పోలీసు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో చిట్ ఫండ్ నిర్వాహకుల మోసాలు పెరుగుతున్నాయని బాధితులు ఆక్రోశిస్తున్నారు.

ఫైనాన్స్ కంపెనీ రూ.10లక్షల చీటిని వేస్తున్నామంటూ నెలకు రూ.21వేలు కట్టించుకుని 14 నెలల వరకు చీటి ప్రారంభించలేదని, దీంతో సదరు కంపెనీకి వెళ్లి నిలదీసిన బాధితులు గతంలో పని చేసిన వారికి మాకు ఎలాంటి సంబంధాలు లేవని చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందన్నారు. ఓ చిట్ ఫండ్ కంపెనీ నిర్వాహకులు చీటీలు వేసిన వారికి డబ్బులు ఇచ్చే సమయానికి ఇవ్వకుండా నెలల తరబడి తిప్పించుకోవడంతో కార్యాలయంలో గొడవకు దిగడంతో కార్యాలయాన్ని మూసివేసి ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నారని అన్నారు.

నిబంధనలు పాతర వేసి చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ ప్రకారం కొత్తగా ఏర్పాటుచేసే చీటి గ్రూపులకు సంబంధించిన వివరాలన్నింటిని జిల్లా రిజిస్ట్రార్ కు సమర్పించాల్సి ఉంటుందన్నారు. మొత్తం ఎన్ని గ్రూపులు నిర్వహిస్తున్నారనే అంశంతో పాటు ఆ గ్రూపులో చేరిన సభ్యులు, చెల్లింపుల వ్యవహారాలు లాంటి అన్ని అంశాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అలాగే ప్రతీ గ్రూప్ కు సంబంధించిన సమాచారాన్ని సదరు రిజిస్ట్రారు అందుబాటులో ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. ధనార్జనే ధేయ్యంగా ఈ చిట్ ఫండ్ కంపెనీలు వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయని, వీటన్నింటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చిట్ ఫండ్ కంపెనీల మోసాలను అరికట్టాల్సిన సంబంధిత శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని అన్నారు.

ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చిట్ ఫండ్ మోసాలపై దృష్టి సారిస్తేనే ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు, కంపెనీల మోసాలు తగ్గుతాయని బాధితులు కోరుతున్నారు. చిట్ ఫండ్ ఆక్ట్ 1982 ప్రకారం చందదారుని ఈ యొక్క పూర్తి వివరాలు గ్రూపు కు సంబంధించిన అన్ని అంశాలను జిల్లా రిజిస్టర్, టీ చిట్స్ ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. అయితే భవిత శ్రీ చిట్ ఫండ్ కామారెడ్డి శాఖ వీటిని అధిగమించి వారి ఇష్టానుసారంగా చిట్టి చందాలను వసూలు చేసి ఎలాంటి నోటీసులు సదరు చందాదారుకి జారీ చేయకుండా చిట్టి ని రిమూవ్ చేశారన్నారు. ఇలా చేయడం వల్ల చిట్ ఫండ్ కంపెనీలకు కొన్ని లక్షల రూపాయల కంపెనీ కమిషన్ల పేరుతో లాభం చేకూరుతుందని, ఇదేంటని సదరు చందాదారులు ప్రశ్నించగా డబ్బులు ఇప్పిస్తామని మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, జనరల్ మేనేజర్ రాజు, రీజనల్ మేనేజర్ అరవింద్ కి భరోసా ఇచ్చానన్నారు.

కానీ గత ఆరు నెలల నుండి సంబంధిత వ్యక్తికి ఎలాంటి సమాధానం చేర్చలేదని, పలుసార్లు సంబంధిత ఆఫీస్ కు వెళ్లగా ఆఫీస్ బాయ్ తప్ప అక్కడ స్టాఫ్ మేనేజర్ ఎవరూ లేకపోవడం వల్ల 15 రోజుల క్రితం ఆ ఆఫీసుకు బాధితుడు తాళం వేశారన్నారు. కానీ భవిత శ్రీ యంత్రాంగం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులు విస్మయానికి గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed