హైకోర్టులో పోచారం భాస్కర్ రెడ్డికి చుక్కెదురు

by Sridhar Babu |
హైకోర్టులో పోచారం భాస్కర్ రెడ్డికి చుక్కెదురు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. బుధవారం హైకోర్టులో పోచారం భాస్కర్ రెడ్డి వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. ఈనెల 5న నిజామాబాద్ డీసీసీబీకి చెందిన 15 మంది డైరెక్టర్లు పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాస తీర్మానం నోటీసును డీసీఓ కు అందజేశారు. ఈనెల 21న అవిశ్వాసంపై ఓటింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రకటన చేశారు. దాంతో పోచారం భాస్కర్ రెడ్డి పదవికి గండం ఏర్పడింది. న్యాయపరంగా డీసీఓ ఇచ్చిన అవిశ్వాస నోటీస్ చెల్లదని పోచారం భాస్కర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. మంగళవారం పోచారం భాస్కర్ రెడ్డి,

ప్రభుత్వం తరఫున ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. గురువారం అవిశ్వాస పరీక్ష ఉండడంతో బుధవారం ఈ విషయంపై కోర్టు తన తీర్పులో పోచారం భాస్కర్ రెడ్డి వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. దాంతో పోచారం భాస్కర్ రెడ్డి పదవి కోల్పోవడం ఖాయమైంది. ఇప్పటికే డీసీసీబీ చైర్మన్ పదవి కోసం క్యాంపు రాజకీయాలు నడుస్తుండగా వారు గురువారం నేరుగా అవిశ్వాస పరీక్ష జరిగే కేంద్రానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో పోచారం భాస్కర్ రెడ్డి ముందుగానే తన పదవికి రాజీనామా చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజామాబాద్ డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమైంది. డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డికి చైర్మన్ పదవి దక్కుతుందని చర్చ జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed