- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కడుపులోనే చిదిమేస్తుండ్రు.. ఆగని లింగనిర్ధారణ పరీక్షలు
దిశ ప్రతినిధి, నిజామాబాద్: అమ్మ కడుపులో ఆడ పుట్టుక ప్రాణం పోసుకుంటోందని తెలిస్తే చాలు.. గర్భంలోనే పిండాన్ని పిండేస్తున్నారు. ఆడపిల్ల అంటేనే సమాజంలో అదోరకమైన భావన ఉండడంతో యేటేటా భ్రూణహత్యల దారుణాలు పెరిగిపోతున్నాయి. లింగనిర్ధారణ తప్పని తెలిసినా చేస్తున్నారు. ప్రాణాలను కాపాడాల్సిన డాక్టర్లు కడుపులో బిడ్డ భూమి మీద పడకుండా ప్రాణాలు తోడేసే తోడేళ్లు గా మారిపోతున్నారు. లింగనిర్ధారణ చేస్తూ భ్రూణ హత్యలకు కారకులవుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఈ నిషేధిత లింగ నిర్ధారణ పరీక్షల దందా జోరుగా సాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నేటి సమాజంలో ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడ బిడ్డ, మగ బిడ్డ తెలుసుకోవడానికి తల్లిదండ్రులు తెగ ఆరాట పడుతున్నారు. ఆడపిల్లలకు ఉన్న చిన్న చూపుకు ఇది నిదర్శనంగా చెప్పవచ్చు.
మగబిడ్డపై తల్లిదండ్రుల్లో ఉన్న ఆసక్తి కొందరు అడ్డదారిలో డబ్బు సంపాదన పై ఆసక్తి ఉన్న వైద్యులకు ఆర్థిక వనరుగా మారింది. అమ్మ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏ బిడ్డ ముందు గా నిర్ధారించి ప్రకటించడం అనేది అనైతికమని, నేరమనే విషయమని తెలిసినా అడ్డగోలు సంపాదనపై ఉన్న మమకారంతో లింగనిర్ధారణను కొందరు వైద్యులు అక్రమ వ్యాపారంగా ఎంచుకుంటున్నారు. అనతికాలంలోనే ఈ వ్యాపారంలో కోట్లు గడిస్తూ ఎక్కడ పడితే అక్కడ కోట్లాది రూపాయల స్థిరాస్తులు కూడపెడుతున్నారు. పేషంట్ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి లింగ నిర్ధారణ పరీక్షకు రూ.30 వేల నుంచి రూ. 50 వేల వరకు తీసుకుంటున్నారు. ఒక్కో కేసులో అంతకన్నా ఎక్కువ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
కడుపులో పెరుగుతోంది ఆడ బిడ్డ అని తెలిస్తే ఇక భ్రూణ హత్యే..
అమ్మ కడుపులో పెరుగుతున్నది ఆడబిడ్డని లింగ నిర్ధారణ పరీక్షల్లో తెలిసిన మరుక్షణం ఆ బిడ్డ భూమ్మీద పడకముందే ఊపిరి తీసేస్తున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో భ్రూణ హత్యలు బాగా పెరిగి పోయినట్లు తెలుస్తోంది. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని తెలిసినా, ఈ పరీక్షలపై ప్రభుత్వం నిషేధాన్ని విధించిందన్న విషయంపై స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ కొందరు గ్రామీణ వైద్యంలో సుధీర్ఘమైన అనుభవమున్న ఆర్ఎంపీ వైద్యులతో పాటు ప్రొఫెషనల్ డాక్టర్లు సైతం గుట్టు చప్పుడు లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రహస్య స్థావరంలో పకడ్బందీగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. పేషంట్ల నుండి ఇష్టారీతిన డబ్బులు దండుకుంటున్నారు. అనతికాలంలోనే కోట్లాది రూపాయలు కూడబెట్టుకుని ఈ వ్యాపారంలో మొఘల్ చక్రవర్తులుగా చక్రం తిప్పుతున్నారు. వీరు చేసే అక్రమ వ్యాపారాన్ని అడ్డుకోకుండా, ఎలాంటి క్రిమినల్ కేసులు కాకుండా వ్యవస్థ లన్నింటినీ మేనేజ్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గుట్టు చప్పుడు నిషేధిత దందా..
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు ఆర్ఎంపీ వైద్యులతో పాటు ప్రొఫెషన్ వైద్యులు కూడా నిషేధిత లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యులుగా కొనసాగుతున్న కొందరు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరే మధ్య వర్తులుగా వ్యవహరిస్తూ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన పేషంట్లను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లి లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఈ దందా నిరాటకంగా సాగుతోందని, ఈ అనైతిక, నిషేధిత పరీక్షల గురించి స్థానికంగా ఎవరికీ తెలియకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. గర్భిణీలకు పకడ్బందీగా ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక్కో లింగ నిర్ధారణ పరీక్షకు దాదాపు రూ. 25 వేల నుంచి పేషంట్ ఆర్థిక స్థాయిని రూ. 80 వేల వరకు పేషంట్ల ఆర్థిక స్థోమతను బట్టి తోచిన విధంగా చార్జి చేస్తున్నరనే ఆరోపణలున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షల్లో మగ బిడ్డ అని తేలితే మధ్యవర్తులైన ఆర్ఎంపీ డాక్టర్లకు పేషంట్ల తరఫు బంధువులు అదనపు నజరానాలు సమర్పించుకుంటున్నట్లు సమాచారం. కడుపులో పెరుగుతున్నది మగబిడ్డ అన్న విషయం నిర్ధారణ అయితే పేషంట్ డెలివరీ అయ్యే వరకు వీరు ప్యాకేజీ మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉన్న కొంతమంది ప్రముఖుల అండదండలతో ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహారాష్ట్ర మహిళకు కామారెడ్డిలో లింగనిర్ధారణ పరీక్షలు..
మహారాష్ట్రలోని లాతూరు నగరానికి చెందిన ఓ మహిళకు లింగ నిర్ధారణ చేసిన కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నాలుగు నెలల క్రితం లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో సదరు మహిళ కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తేలడంతో ఆ మహిళ మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ఓ ఆస్పత్రిలో అబార్షన్ చేసుకుని పిండాన్ని తొలగించుకుంది. ఈ అబార్షన్ విషయం లాతూరు పోలీసులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు విచారణ నిర్వహించారు. పోలీసుల విచారణలో సదరు మహిళ కామారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో లింగ నిర్దారణ పరీక్షలు చేయించుకుందని మహారాష్ట్ర పోలీసులు గుర్తించారు. లాతూరు పోలీసులు కామారెడ్డి కి వచ్చి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చి ప్రైవేట్ ఆస్పత్రి వైద్యున్ని అరెస్ట్ చేశారు. దీంతో కామారెడ్డి లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి బహిర్గతమైంది. ఇదే ఆస్పత్రిలో కొంత కాలంగా యధేచ్ఛగా గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా అనేక ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆ దిశలో కూడా విచారణ జరుపుతున్నారు.
ప్రభుత్వ వైద్యుడిగా చేస్తూ.. అక్రమ దందా..
ఈ వైద్యుడు ఓ పక్క గాంధారి ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ గా కూడా పని చేస్తూ ఈ అక్రమ దందాను నిర్వహిస్తుండటంతో ఆయనపై వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. ఆయన నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రిని కూడా సీజ్ చేశారు. ఈ వైద్యుడిపై గతంలోనూ పలు కేసులున్నాయి. ఆస్పత్రిని సీజ్ చేసిన ప్రతిసారీ కొత్త పేరుతో ఆసుపత్రిని ప్రారంభించి మళ్లీ ఇదే దందాను నిర్భీతిగా కొనసాగిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. సదరు వైద్యుడిపై లింగ నిర్ధారణ కేసుతో పాటు ఆస్పత్రి సిబ్బంది, వైద్యుని సహకారంతో శిశువు విక్రయం కేసు కూడా నమోదైనట్లు సమాచారం. ఈ కేసులో ప్రస్తుతం అరెస్టయిన వైద్యుడు బెయిల్ పై బయటకు వచ్చారు. ప్రభుత్వ వైద్యుడిగా కొనసాగుతున్న ఆ వైద్యున్ని ఇటీవల నమోదైన కేసులో సస్పెండ్ చేసి హైదరాబాద్ కు అటాచ్ చేశారు. ప్రస్తుతం అదే వైద్యున్ని మళ్ళీ లింగ నిర్ధారణ కేసులోనే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ని సార్లు పట్టుబడ్డ బుద్ధి మారని వైద్యుడి తీరు పలు విమర్శలకు గురవుతుంది.
తాజాగా రాజంపేటలో ల్యాబ్ టెక్నీషియన్..
కామారెడ్డి జిల్లాలో లింగనిర్ధారణ కేసులో ఓ ప్రభుత్వ వైద్యుడు పట్టుబడితే తాజాగా ఆ వైద్యుడి వద్ద గతంలో శిష్యుడిగా పని చేసిన ల్యాబ్ టెక్నీషియన్ సీసీఎస్ పోలీసులకు పట్టుబడ్డాడు. జిల్లాలోని రాజంపేట మండల కేంద్రానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ బల్ల రవి కూడా కొద్ది రోజుల వ్యవధిలోనే పట్టుబడటం విశేషం. జిల్లాలో గురు శిష్యులిద్దరూ కొద్ది రోజుల వ్యవధిలోనే పట్టుబడటం సంచలనం రేపుతోంది. రాజంపేట మండల కేంద్రానికి చెందిన ల్యాబ్ టెక్నీషియన్ రవిని కామారెడ్డి బుధవారం రాత్రి కామారెడ్డి లో అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారు జాముల రవి సొంత గ్రామం రాజంపేటలోని ఆయనింటిపై ఇంటిలో సీసీఎస్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. లింగ నిర్దారణకు ఉపయోగించే పరికరాలు, యంత్రాలు కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడనే ఆరోపణలపై రవిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. కొంత కాలంగా ఇటీవల లింగ నిర్ధారణ కేసులో అరెస్టయిన ప్రభుత్వ వైద్యుడు నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న క్రమంలో లింగ నిర్ధారణ పరీక్షల్లో తర్ఫీదు పొందిన రవి సొంతంగా పరీక్షలు చేస్తున్నాడన్న ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో గురువారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. ఎన్నేళ్లుగా ఈ దందాను కొనసాగిస్తున్నాడనే విషయాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి.
జిల్లా కేంద్రంలోనూ ఓ మూడు హాస్పిటళ్లపై ఆరోపణలు
జిల్లా కేంద్రంలోనూ ఓ మూడు ఆస్పత్రులపై లింగ నిర్ధారణ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో పలు మార్లు జిల్లా ఉన్నతాధికారులు ఆయా ఆస్పత్రుల యాజమాన్యాన్ని ఈ విషయంలో హెచ్చరించినట్లు సమాచారం.హెచ్చరికల నేపథ్యంలో కొంత కాలం పాటు ఈ పరీక్షలను నిలిపి వేసినప్పటికీ మళ్లీ పరీక్షలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో ప్రభుత్వ వైద్యుడు ఈ కేసులో పట్టుబడిన తర్వాత ముందస్తు జాగ్రత్తగా ఈ ఆస్పత్రుల్లో పరీక్షలు నిలిపివేసినట్లు సమాచారం.ఆయా ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న ఈ దందాకు పొలిటికల్ సపోర్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.