మూలమలుపుల వద్ద రోడ్డు సంకేతాలు.. స్పీడ్ బ్రేకర్ల జాడేది..

by Sumithra |
మూలమలుపుల వద్ద రోడ్డు సంకేతాలు.. స్పీడ్ బ్రేకర్ల జాడేది..
X

దిశ, గాంధారి : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టుగా ఉంది ఆ మేజర్ మండలం. మండల పరిధిలో 44 గ్రామ పంచాయతీలు ఉండగా మండల కేంద్రంలో కనీసం ఒక్క స్పీడ్ బ్రేకర్, రోడ్డు సంకేతాలు కూడా లేవు. రోజుకో రోడ్డు ప్రమాదం జరుగుతున్నా ఆర్ అండ్ బీ అధికారులు మాత్రం మూలమలుపుల వద్ద రోడ్డు గుర్తులు, స్పీడ్ బ్రేకర్లు కూడా ఏర్పరచడం లేదు. పూర్తి వివరాలలోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని భారత్ పెట్రోలియం బంక్ వద్ద గల మూలమలుపు ఇదివరకే ఎంతో మందిని బలితీసుకుంది. దాదాపు మూడు నెలల వ్యవధిలోనే మూల మలుపు వద్ద అనేకమంది క్షతగాత్రులు కాగా ఇందులో చాలామంది ప్రమాదం జరిగిన చోటే మృత్యువాత కూడా పడ్డారు.

అలాగే క్షతగాత్రులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. మండల కేంద్రంలో చాలా చోట్ల రోడ్డు సూచికల బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు అవసరం చాలా ఉంది. ముఖ్యంగా ప్రధాన కూడలి వద్ద, స్కూల్ జోన్ల వద్ద అవసరం ఉన్నప్పటికీ ఒక్కదాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. చాలా గ్రామాల్లో రోడ్లు వేసినప్పటికీ స్పీడ్ బ్రేకర్లు వేయలేని పరిస్థితి ఉంది. పోతంగల్ వద్ద చేపడుతున్న నూతన రోడ్డు నిర్మాణ పనులలో కూడా ఇలాంటి ప్రమాద సూచికలు కనిపించకపోవడం విశేషం. సంబంధిత కాంట్రాక్టర్ను ఈ విషయం పై వివరణ కోరగా త్వరలోనే ఏర్పాటు చేయిస్తాం అని చెప్పి జారుకున్నారు. మళ్లీ అదే తంతుగా అక్కడ ప్రమాదాలు జరుగుతూ నలుగురి ప్రాణాలు కూడా పోయాయి.

మూలమలుపు వద్ద లేని సంకేతాలు, స్పీడ్ బ్రేకర్లు...

మూలమలుపు వద్ద ఎన్నో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. అయితే ఒక్కసారిగా మలుపు ఉండడంతో ముందస్తుగా వాహనదారులు అప్రమయ్యతమయ్యేందుకు ఏర్పాటు చేయవలసిన గుర్తింపు చిహ్నాలు, స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కేవలం ఆదివారం ఒక్కరోజే రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి కూడా అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇకనైనా అధికారులు స్పందించి, వరుసగా ప్రమాదాలకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

నిధులు మంజూరు కాలేదు - త్వరలోనే పూర్తి చేస్తాం ఏఈ రవి

గాంధారి మండల కేంద్రంలో అవసరమైన స్పీడ్ బ్రేకర్లు, సైనింగ్ బోర్డ్ చాలా చోట్ల పెట్టాల్సి ఉందని అన్నారు. ఇవి లేక మండల కేంద్రంలో పలుచోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్ అండ్ బీ ఏఈ రవిని దిశ వివరణ కోరగా వాస్తవానికి నిధుల కొరత ఉన్నందున పనులు పూర్తిగా చేయలేకపోతున్నామని అన్నారు. నిధులు మంజూరు కాగానే పూర్తి స్థాయిలో పనులు చేస్తామని తెలిపారు. ఇదివరకే రెండు మూడు సార్లు పై స్థాయి అధికారులకు కూడా విన్నవించామని, త్వరలోనే నిధులు మంజూరు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story