ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో నిజామాబాద్ యువకుడు

by Sridhar Babu |
ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో నిజామాబాద్ యువకుడు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా పేరు మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ రికార్డులకెక్కింది. 1991లో బొంబాయి బాంబు పేలుళ్లు, నిజామాబాద్ జిల్లాలో అజామ్ ఘోరి కదలికలు, ఐఎస్ఐ ఏజంట్ల విషయంలో గతంలో ఎన్ఐఏ నిజామాబాద్ జిల్లాలో విచారణ జరిపిన విషయం తెలిసిందే. సారంగాపూర్ లో పాకిస్తాన్ కు చెందిన ఆషిక్ అలీ పట్టుబడడం, బోధన్ లో సైకిల్ వ్యాపారి హత్య , నిజామాబాద్ ఐఎస్ఐ శిక్షణ పొందిన ఉగ్రవాది ఆత్మహత్య తర్వాత దాదాపు దశాబ్ధాల తర్వాత మళ్లీ నిజామాబాద్ జిల్లాలో ఉగ్రకార్యకలాపాల విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ విషయంలో ఎన్ఐఏ విచారణ చేపట్టి జిల్లా కేంద్రానికి చెందిన యువకుడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చి అతని ఆచూకీ తెలిపిన వారికి పారితోషికం ఇస్తామని తెలిపింది. నిజామాబాద్ నగరంలోని మాలపల్లికి చెందిన ఎండి.అబ్దుల్ అహద్ ఆలియాస్ ఎంఏ ఆహాద్ పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. నిషేదిత పీఎఫ్ఐ కార్యకలాపాల కేసులో నిజామాబాద్ నగరానికి చెందిన యువకుడితో పాటు జగిత్యాల జిల్లాకు చెందిన అబ్దుల్ సలీం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ పేర్లను ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చి వారి కోసం గాలిస్తుండడంతో

జిల్లాలో పీఎఫ్ఐ కార్యకలాపాలపై మరోసారి చర్చ మొదలయింది. నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ లో 2022 జూలై 4న 141/2022 ఎఫ్ఐఆర్ కింద పీఎఫ్ఐ కార్యకలాపాలపై కేసు నమోదైంది. నిజామాబాద్ రూరల్ మండలం గుండారం గ్రామానికి చెందిన పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షేక్ షాదుల్లా ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాదర్ యువతకు ఉగ్రకార్యకలాపాలపై శిక్షణ ఇస్తున్నాడని పోలీసులు కేసు నమోదు చేసి వారిద్దరితో పాటు ఎండి. ఇమ్రాన్, అబ్దుల్ మోబిన్ లతో పాటు నలుగురిపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. పీఎఫ్ఐ నిషేధిత సంస్థ కావడంతో ఈ కేసును నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ 2022 ఆగస్టు 26న కేసు విచారణ చేపట్టింది. సుమారు 28 మందిపై చార్జీషీట్ నమోదు చేసింది. 400 మందికి శిక్షణ ఇచ్చినట్లు ఆనాడు ఎన్ఐఏ గుర్తించింది. సెప్టెంబర్ 22న నిజామాబాద్ జిల్లాలో 23 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాల్లోనూ 38 ప్రాంతాల్లో ఏకకాలంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించిన విషయం తెల్సిందే. ఈ విషయంలో చాలా మందిని హైదరాబాద్ లో ఎన్ఐఏ విచారణ చేపట్టడంతో పాటు వారి ఆర్థిక కార్యకలాపాలు, ఉగ్రవాద శిక్షణపై విచారణ చేపట్టింది. ఈ నెలలో అబ్దుల్ ఆహాద్ పై

ఎన్ఐఏ చార్జీషీట్ నమోదు చేసి అతని ఆచూకీ కోసం లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు పొరుగు జిల్లాలో జరిగిన శిక్షణ పొందిన వారి కోసం వెతుకులాట కొనసాగుతుంది. కేరళకు చెందిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) లీగల్ ఆర్గనైజేషన్ పేరిట నిజామాబాద్ జిల్లాలో అడుగుపెట్టిన విషయం తెల్సిందే. పేద విద్యార్థుల చదువుకు సహకరిస్తున్నామని, స్వచ్చంద సంస్థ ముసుగులో జిల్లాలో కాలుపెట్టి పీఎఫ్ఐ చాలానే విస్తరించింది. జగిత్యాల్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో దీని కార్యక్రమాలు పెరిగాయి. గతంలో ఏకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పీఎఫ్ఐ పై పోలీసుల కేసులను నిరసిస్తూ ఏకంగా ధర్నాకు కూడా దిగిన చరిత్ర ఉంది. అంతేగాకుండా కొన్ని రాజకీయ పక్షాల లీడర్లు పీఎఫ్ఐకి వెన్నుదన్నున్నారనేది అందరికీ తెలిసిన విషయమే.

నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 28 మందిని చార్జీషీట్ లో పేర్కొన్న ఎన్ఐఏ ఎం.ఏ. ఆహాద్ తో పాటు మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టింది. అబ్దుల్ ఆహాద్ ను మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చడంతో దాని కార్యకలాపాలలో శిక్షణ పొందిన యువకులకు వారి తల్లిదండ్రులకు వణుకు మొదలయింది. గతేడాది సెప్టెంబర్ లో జరిగిన తనిఖీల్లోనే చాలా మంది నిరుద్యోగ యువత పీఎఫ్ఐ కార్యకలాపాలపై ఆకర్షితులైనట్లు గుర్తించి వారి కోసం వేటాడడం మొదలుపెట్టింది. ఇప్పుడు జిల్లాకు చెందిన ఆహాద్ పై చార్జీషీట్ నమోదు చేయడంతో పాటు ఆచూకీ కోసం రివార్డును ప్రకటించడంతో అతను దొరికితే మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story