తల్లిదండ్రులను కడతేర్చిన దత్తపుత్రుడు

by Sumithra |   ( Updated:2022-10-14 12:04:13.0  )
తల్లిదండ్రులను కడతేర్చిన దత్తపుత్రుడు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పున్నామనరకం నుంచి తప్పిస్తాడని పిల్లాడిని పెంచుకుంటే సొమ్ములకోసం తల్లిదండ్రులను కడతేర్చాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా, అలూర్ మండల కేంద్రంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 11న జరిగిన వృద్ద దంపతుల హత్యకేసును ఛేదించినట్లు నిజామాబాద్ సీపీ కేఆర్ నాగరాజు తెలిపారు. శుక్రవారం ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. ఈ నెల 11న ఆలూర్ గ్రామంలోని వృద్ద దంపతులు కుమ్మరి అలియాస్ పడిగెల గంగారాం, గంగామణిలు గ్రామంలోని వారి ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

మృతురాలి చెల్లెలు పల్లె అనురాధ ఫిర్యాదు మేరకు ఆర్మూర్ పోలిసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్మూర్ ఎసీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ సీఐ సురేష్, ఆర్మూర్ ఎస్సై ప్రదిప్ కుమార్ లు విచారణ చెపట్టారు. అందులో భాగంగా వృద్ద దంపతుల దత్త పుత్రున్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. ఆలూర్ గ్రామనికి చెందిన అన్రాసి వెంకటితో కలిసి హత్యచేసినట్టు మైనర్ బాలుడు ఒప్పుకున్నాడు. మృతులు కుమ్మరి అలియాస్ పడిగెల గంగారాం అతని భార్య గంగామణిల గొంతును చీరతో బిగించి చంపేసాడని చెప్పాడు. ఆ తరువాత ఉరి వేసుకున్నట్లుగా చిత్రీకరించారు. ఇద్దరు చనిపోయిన తరువాత మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించుకుని పోయారు.

వృద్ద దంపతులను హత్యకేసులో శుక్రవారం దత్తపుత్రుడిని, అన్రాసి వెంకటిలను అలూర్ గ్రామంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. అన్రాసి వెంకటిపై 2008 లో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక రేప్ అండ్ మర్డర్ కేసు, ఒక దొంగతనం కేసు నమోదు అయిందని తెలిపారు. ఆ రేప్, మర్డర్ కేసులో అతనికి జీవిత కాలం శిక్షపడి జైలు శిక్షను అనుభవించి 2020 అక్టోబర్ 10న సత్ప్రవర్తన కింద జైల్ నుండి విడుదల అయ్యాడని తెలిపారు. జైలు నుంచి విడుదలైన రెండు సంవత్సరాలకు డబుల్ మర్డర్ లో మళ్లీ అరెస్టు చేశామని సీపీ తెలిపారు. డబుల్ మర్డర్ కేసును మూడు రోజుల్లో ఛేదించిన ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ సీఐ సురేష్, ఆర్మూర్ ఎస్సై ప్రదిప్ కుమార్ లకు ఏఎస్సై శివరాం, కానిస్టేబుల్స్ గంగా ప్రసాద్, డి ప్రసాద్, గప్పార్లకు రివార్డులను అందచేస్తున్నట్లు సీపీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed