జూనియర్ సివిల్ జడ్జిల బదిలీలు, నియామకాలు..

by Sumithra |
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీలు, నియామకాలు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీలు చేస్తూ మరికొందరిని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా కోర్టు సముదాయంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నభవ్య కోవిని కోదాడకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి రూబినా ఫాతీమ బదిలీ పై రానున్నారు. నిజామాబాద్ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి సౌందర్య కుశనపల్లిని నల్గొండ కు బదిలీ చేశారు. నిజామాబాద్ నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి గిరిజ తిరందాసును మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్ పల్లి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి గా నియమించారు. ఆర్మూర్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాచర్ల షాలిని నకిరేకల్ కోర్టుకు బదిలీ చేశారు. బోధన్ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి మల్లాది అపర్ణను మహేశ్వరం కోర్టుకు బదిలీ చేశారు. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ దుర్వను గోదావరి ఖనికి బదిలీ చేశారు. కామారెడ్డి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా తిరుచినపల్లి ఎస్.పి.భార్గవి ని నియమించారు.

జూనియర్ సివిల్ జడ్జిలకు ఘనంగా వీడ్కోలు..

జూనియర్ సివిల్ జడ్జిలుగా నియమాకమై తొలిసారి నిజామాబాద్ జిల్లాకోర్టు సముదాయంలో విధులు నిర్వహించడం మా జీవితాలలో మరిచిపోలేని మధురస్మృతిగా నిలిచి ఉంటుందని జూనియర్ సివిల్ జడ్జిలు భవ్య కోవి, గిరిజ తిరందాసు, సౌందర్య కుశనపల్లి అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో వారు మాట్లాడారు. మూడేళ్ళ పైచిలుకు పదవీకాలం న్యాయవాదుల సహకారంతో మూడురోజుల్ల గడిచిపోయిందని తెలిపారు. మా విధుల పనివిధానంలో "బార్ " నుండి నేర్చుకున్నదే ఎక్కువవని, నేర్చుకునే మహాభాగ్యం కల్పించిన నిజామాబాద్ బార్ అసోసియేషన్ మా వృత్తి జీవనంలో ఎప్పటికి చిరస్మరణీయమేనని వారు భావోద్వేగాలతో వెల్లడించారు. చిన్న వయసులోనే జూనియర్ సివిల్ జడ్జిలు గా విధులు నిర్వహించిన కాలంలో మమ్మల్ని కుటుంబ సభ్యులుగా అక్కున చేర్చుకుని ఆదరించి, ఆత్మీయతానురాగాలు మూటగట్టుకుని వెళుతున్నామని అవి మా జీవితాంతం తీపిగుర్తులుగా ఉంటాయని వారు అన్నారు.

Advertisement

Next Story