బ్లాక్ లిస్టులో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులకు పోస్టింగ్ లు..

by Sumithra |
బ్లాక్ లిస్టులో ఉన్న పాఠశాలలకు ఉపాధ్యాయులకు పోస్టింగ్ లు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో గత నెలలో జరిగిన ఉపాధ్యాయుల పదోన్నతులలో బదిలీలలో సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. వీరికి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా అలాట్ అయిన పాఠశాలలను జూనియర్లకు మోడిఫికేషన్ చేయడం వల్ల సీనియర్ ఉపాధ్యాయులు తమకు జరిగిన అన్యాయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయగా, జిల్లా విద్యాశాఖ చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఫిర్యాదులు చేసిన ఉపాధ్యాయులను బుజ్జగించే పనిలో పడింది. ఒక్కొక్కరిని డీఈఓ ఆఫీస్ కు పిలిపించుకొని అనధికార వ్యక్తులతో కౌన్సిలింగ్ ఇప్పించడం, అలాట్ పాఠశాలలో జాయిన్ కావాలని ఒత్తిడులు చేయడం ద్వారా కొంతమంది చేసేదేమీ లేక అయిష్టంగానే తమకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించలేక జాయిన్ అయిపోయినారు.

కానీ మరికొందరు తమకు జరిగిన అన్యాయం పై న్యాయం జరగాలని తనకు అలాట్ అయిన పాఠశాల ఫిలప్ అయివున్నందున బాధితులకు అనుకూలమైన పాఠశాలలను (కోరుకున్న చోటు) బదిలీ చేసిన వ్యవహారం ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. దీనిని బట్టి పదోన్నతులు, బదిలీలలో అక్రమాలు జరిగిందనడానికి బలమైన ఆధారాలు లభించినట్లు అయింది. అనేకంగా అక్రమ మోడిఫికేషన్లు జరిపిన వాటిలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ సంచాలకులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ విషయంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, బాధ్యుల పై వేటు వేయాలని డిమాండ్ ను ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్నాయి.

బ్లాక్ లిస్టులో ఉన్న పాఠశాలలకు పోస్టింగ్ లా ?

సోషల్ స్టడీ సబ్జెక్టులో లోకల్ బాడీ తెలుగు మీడియంలో 18 రోస్టర్ పాయింట్ లో ఉన్న ఉపాధ్యాయుడు కి అలాట్ అయిన పాఠశాలను మార్చడం వల్ల తను కోరుకొనని లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ పేరుతో మరో పాఠశాల జెడ్పీఎస్ఎస్ ఏర్గట్ల అలాట్ అయ్యింది. మొత్తం 80 పదోన్నతులు ఇస్తే 18 వ నెంబర్ లో రోస్టర్ పై ఉన్న ఉపాధ్యాయుడు తను కోరుకున్నది ఎలా దక్క లేదని పాఠశాల డైరెక్టర్ కు చేసిన ఫిర్యాదు చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి అతనికి కేటాయించబడ్డ జడ్పీహెచ్ఎస్ ఏర్గట్లను మోడిఫికేషన్ చేస్తూ జక్రాన్ పల్లి మండలంలోని యుపీఎస్ గాంధీనగర్ కు జాయినింగ్ ఉత్తర్వులు ఇవ్వడంతో ఈనెల 4న అక్కడ జాయిన్ అయ్యారు. ఇందులోను అసలు ట్విస్ట్ ఉంది. ఈ పాఠశాలలో విద్యార్థులు లేరని ఆరు ఏడు తరగతులలో విద్యార్థుల సంఖ్య జీరో కావడంతో ఈ పాఠశాలను బ్లాక్ల్ లిస్టులో ఉంచారు. ఒకటవ తరగతి నుంచి 5 వ తరగతి వరకు 18 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు ఒక ఎస్జీటీ రెండు పండితులు పనిచేస్తున్నారు. మొత్తం ఐదుగురు పనిచేస్తున్నరు. బ్లాక్ లిస్టులో ఉన్న ఖాళీని ఓపెన్ చేసి ఇవ్వడాన్ని బట్టి అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇలా బ్లాక్ పాఠశాలను ఓపెన్ చేయడానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ అనుమతి ఉండాలి. కావున విద్యార్థులు లేని పాఠశాలకు పోస్టు ఓపెన్ చేసే అవకాశమే లేదు. జడ్పీహెచ్ఎస్ ఎర్గట్లలో పదోన్నతులలో వచ్చిన మరొకరు కూడా మాడిఫికేషన్ ద్వారా జాయిన్ కాకపోవడంతో ఇక్కడ 275 మంది విద్యార్థులకు కనీసం ఒక ఉపాధ్యాయుడు కూడా లేని దుస్థితి ఏర్గట్ల పాఠశాల ఎదుర్కొంటుంది. ఇదిలా ఉండగా గణితశాస్త్రంలో మరో ఉపాధ్యాయుడు రోస్టర్ 32 వద్ద తనకు రావలసిన జెడ్పీహెచ్ఎస్ పల్లికొండ పాఠశాలను తన తర్వాతి రోస్టర్ 34 కు ఎలా కేటాయించారని, (ఇతనికి కేటాయించబడింది జడ్పీహెచ్ఎస్ చీమన్ పల్లి) తనకు జరిగిన అన్యాయాన్ని పాఠశాల డైరెక్టర్ కు ఫిర్యాదులు చేసి 15 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి మొత్తానికి తను కోల్పోయిన పల్లికొండ పాఠశాలను కాకుండా భీమ్ గల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పోస్టింగును పొందగలిగాడు. ఈ పాఠశాల కూడా బ్లాక్ లిస్టులో ఉన్నది.

మాడిఫికేషన్ నిబంధనల ప్రకారం జరిగాయా ?

బయో సైన్స్ విభాగంలో పదోన్నతుల విషయంలో ఒక పోస్టు ఉన్న పాఠశాలకు ఇద్దరేసీ ఉపాధ్యాయులను కేటాయించడం, రెండుసార్లు నాటు విల్లింగ్ ఇచ్చిన వారికి పదోన్నతులు కల్పించడం ఒక్క నిజామాబాద్ జిల్లాలో మాత్రమే జరిగింది. సంబందిత సబ్జెక్ట్ లో స్కూల్ అసిస్టెంట్ లుగా 74 మంది ఎస్జీటీలకు పదోన్నతులు ఇవ్వవలసి ఉండగా 80 మందికి పదోన్నతులు ఇచ్చారు. ఎస్సీ రోస్టర్ పాయింట్లు విస్మరించడం, రోస్టర్ నంబర్లు క్రమ పద్ధతిలో లేకపోవడం, సీనియారిటీ జాబితాలో లేని వారికి సైతం పదోన్నతి, వేకెన్సీలో రెండు పోస్టులు ఉన్న పాఠశాల నుండి వెబ్ కౌన్సిలింగ్ అనంతరం అందులో ఒకరిని తొలగించి మరోచోటికి ఇవ్వడం, పదోన్నతికి సంబంధం లేని లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ పదాన్ని జాబితాలో చేర్చడం విశేషం.

ఎంఈవోలు, హెడ్మాస్టర్లు ఒక్కో ఉపాధ్యాయునిలకు రెండు పాఠశాలలకు రిలీవింగ్ ఉత్తర్వులు ఇవ్వడం భిన్న సంఖ్యతో ఒక సబ్జెక్టులో రెండు జాబితాలు వెలువరించడం, 2000 డీఎస్సీ ఉపాధ్యాయులను విస్మరించి 2002 డీఎస్సీ వారికి ఓపెన్ లో పదోన్నతి కల్పించడం గమానార్హం. ప్రధాన ఉపాధ్యాయ సంఘం నేతలు పదోన్నతులు, పోస్టింగ్ విషయంలో భారీగా వసూళ్లు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అంతే గాకుండా బదిలీలు, పదోన్నతుల విషయంలో డీఈఓ కార్యాలయంలో తిష్ట వేసిన ముదుర్ల సహయంతో మార్పులు చేర్పులు చేయించారని విమర్శలు లేకపోలేదు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ సంచాలకులకు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో విచారణలో నిజానిజాలు నిగ్గు తేల్చి బాధ్యుల పై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.

Next Story