గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు.. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ ధర్మపురి

by Vinod kumar |
గ్రామీణ ప్రజల ముంగిట్లోకి కేంద్ర పథకాలు.. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఎంపీ ధర్మపురి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: వివిధ వర్గాల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రజల ముంగిట్లోకి తేవడం జరిగిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ కేంద్ర పథకాల గురించి అవగాహన పెంపొందించుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం గ్రామగ్రామాన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోందని స్పష్టం చేశారు. సోమవారం మోపాల్ మండలం సిరిపూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హజరై మాట్లాడుతు.. కేంద్ర పథకాల వివరాలతో రూపొందించిన క్యాలెండర్ ను ఎంపీ ఆవిష్కరించారు. స్థానికులతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. క్యాలెండర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్ ను సెల్ ఫోన్ ద్వారా స్కానింగ్ చేస్తే కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మీకు తెలిసిపోతాయని, ఆ సదుపాయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఎంపీ అరవింద్ సూచించారు.


అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలనే అకుంఠిత దీక్షతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఇప్పటికే వీటిని చాలామంది వినియోగించుకుని లబ్ది పొందుతున్నారని గుర్తు చేశారు. ఆయా పథకాల ద్వారా ప్రయోజనం పొందిన వారిచే సభలో వారి అనుభవాలను, అనుభూతులను స్వయంగా వివరింపజేశారు. పథకాలను వినియోగించుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అని ఎంపీ ఆరా తీయగా, అలాంటిదేమీ లేదని దరఖాస్తు చేసుకున్న వెంటనే అర్హతను అనుసరిస్తూ తమకు లబ్ధి చేకూరేలా అధికారులు తోడ్పాటును అందించారని లబ్ధిదారులు సమాధానం ఇచ్చారు. కాగా, వీరి తరహాలోనే గ్రామీణ ప్రజలు కేంద్ర పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ సూచించారు.

అర్హులైన లబ్ధిదారులు అందరికీ పథకాల ప్రయోజనాలు అందుతాయని, అందుకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ప్రస్తుతం సంకల్ప యాత్ర ద్వారా మీ ముంగిటకు వచ్చిన అధికారులకు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. డ్రోన్ ద్వారా నానో యూరియా పొలంలో పిచికారి చేసే విధానాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా వివరించగా, ఎంపీ అరవింద్, స్థానిక రైతులు ఆసక్తితో తిలకించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సామముత్యం, ఉపసర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ రావు, ఏపీడి సంజీవ్ కుమార్, ఏవో రవీందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story