మహాయుతి సర్కార్ పై మహా వికాస్‌ అఘాడీ చార్జిషీట్‌ విడుదల

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-13 09:52:14.0  )
మహాయుతి సర్కార్ పై మహా వికాస్‌ అఘాడీ చార్జిషీట్‌ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : దీపావళికి ముందే మహారాష్ట్రలో రాజకీయ పార్టీల విమర్ళల టపాసులు పేలుతున్నాయి. దీపావళి తర్వాత రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నద్దమవ్వగా..రానున్న ఎన్నికల సమరంలో తలపడుతున్న అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ లు పరస్పర విమర్శల దాడులకు పదును పెడుతున్నాయి. అధికారాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్‌)తో కూడిన మహాయుతి కూటమి ఎన్నికల బరిలో దిగుతున్నది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌ను కొనసాగించి రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు ప్రతిపక్షాలు కాంగ్రెస్‌, శివసేన(ఠాక్రే), ఎన్సీపీ(శరద్‌ పవార్‌)తో కూడిన మహా వికాస్‌ అఘాడీ ప్రయత్నిస్తున్నది. దీంతో రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. ఈ ఎన్నికలు రాష్ట్రంలో అధికారం ఎవరిదో నిర్ణయించడంతో పాటు శివసేన, ఎన్సీపీల భవిష్యత్తును కూడా తేల్చేయనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు కూటములకు ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తాజాగా జరిగిన ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యోదంతం కూడా అధికార, విపక్షాల మధ్య మాటలు మంటలు రేపుతోంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్, శివసేన యూబీటీ, ఎన్సీపీ ఎస్పీ (ఎంవీఏ) నేతలు ఐక్యంగా మహాయుతి బీజేపీ ప్రభుత్వంపై చార్జిషీట్‌ను విడుదల చేశారు. మహాయుతి ప్రభుత్వ పాలనలో వైఫల్యాలను ఈ చార్జిషీట్‌ లో ప్రస్తవించారు. ఈ కార్యక్రమంలో శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే, అతుల్‌ లోధీ పాటిల్‌ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సిద్ధిఖీ హత్య మహాయుతి ప్రభుత్వంలో క్షిణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని విమర్ళలు గుప్పించారు.

Advertisement

Next Story