మోతె వీడీసీ, దళితుల భూవివాదంకు తెర

by Kalyani |
మోతె వీడీసీ, దళితుల భూవివాదంకు తెర
X

దిశ, భీంగల్ : వేల్పూర్ మండలంలోని మోతె గ్రామంలో విలేజ్ కమిటీ, దళితలకు మధ్య జరుగుతున్న ఓ భూ వివాదానికి తెర పడింది. సుమారు నాలుగేళ్లుగా రగులుతున్న ఈ భూ వివాదం గ్రామంలో 144 సెక్షన్ అమలు వరకు వచ్చి ఇటీవల ఎట్టకేలకు పరిష్కారమైంది. దీంతో భూమికోసం పోరాడుతున్న దళిత కుటుంబం, రెవెన్యూ, పోలీసు విభాగం, గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.

వివరాలలోకి వెలితే మోతెలోని రాజారాజేశ్వర దేవాలయం భూమి పక్కన సర్వే నంబరు 333లో ఎకరం 20 గుంటల భూమి 1962 నుండి ఇస్సాపల్లి గంగారం, ఇస్సాపల్లి నడ్పి గంగారం అనే వ్యక్తుల పేరుపై రికార్డుల్లో నమోదై ఉంది. అప్పట్లో ఈ భూమిని ఇస్సాపల్లి గంగారాం రాజారాజేశ్వరస్వామికి ఇచ్చారని, దేవాలయానికి ఇచ్చిన భూమిపై ఎవరు అబద్దమాడరు అనే నమ్మకంతో పేరు మార్పిడి చేయించలేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

మా తాత ఆ భూమిని దేవాలయానికి ఇవ్వలేదని, రికార్డ్ ప్రకారం ఆ భూమి తమదేనని ఇస్సాపల్లి గంగారాం మనువడు ఇస్సాపల్లి రవి గ్రామస్తులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు, దళితుల మధ్య ఆ భూమి మాది అంటే మాది అని ఆ భూమికి దళితులు ఏర్పాటు చేసుకొన్న పెన్సింగ్ ను గ్రామస్థులు నాలుగుసార్లు తొలగించారు. హద్దురాల్లను పగులగొట్టారు. ఈ గొడవలో ఒకరినొకరు దాడి చేసుకోవడం తో పాటు కేసులు కూడా అయిన విషయం విధితమే. అంతే కాకుండా ఈ భూవివాదం సాంఘిక బహిష్కరణ వరకు దారి తీసింది. ఈ తరుణం లో

రెవెన్యూ అధికారులు సర్వే జరిపి ఆ భూమి ఇస్సాపల్లి గంగారం వారసులకు చెందుతుందని తేల్చిచెప్పారు. అయిన గ్రామస్తులు ఆ భూమి దేవాలయానిదేనని మొండి పట్టుబట్టారు. గ్రామస్తులు వారిపై దాడికి దిగగా ఇస్సాపల్లి రవి 2023లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గత ఏడాది సీపీగా బాధ్యతలు చేపట్టిన కల్మేశ్వర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ను స్వీకరించిన పోలీస్ కమిషనర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో పోలీసులు సైతం గ్రామస్తులకు చాలా సార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టం ప్రకారం ఇస్సాపల్లి గంగారంకు చెందిన ఎకరం 20 గుంటల భూమి వారి వారసులకే చెందుతుందని, గ్రామస్తులకు ఎటువంటి హక్కులేదని,దానిపై ఎటువంటి అజమాయిషీ చేసినా కేసులు నమోదు అవుతాయని నచ్చజెప్పారు. అయినప్పటికీ గ్రామస్తులు గత బుధవారం 20న తిరిగి గ్రామస్థులు ఇస్సాపల్లి గంగారం తన భూమికి పాతిన హద్దురాల్లను, ఫెన్సింగ్ను చెరిపి వేశారు.

ఈ విషయాన్ని గంగారాం కుటుంబీకులు వేల్పూర్ పోలీసులకు మళ్ళీ ఫిర్యాదు చెయ్యడం తో ఎస్సై వినయ్ కుమార్ మోతె గ్రామస్తులను పిలిపించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు రిమాండుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో గ్రామస్తులు తమ నిర్ణయాన్ని మార్చుకొని ఇకనుండి ఆ భూమి జోలికి వెళ్ళ బోమని గంగారం కుటుంబీకులకు రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. గంగారాం కుటుంబీకులు సైతం దేవాలయానికి తమ వంతుగా 24 గుంట భూమిని విరాళంగా రాసి ఇచ్చారు. దీంతో నాలుగేళ్లుగా రగులుతున్న భూవివాదం పరిష్కారం కావడంతో అధికారులు, గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.

Next Story

Most Viewed