Acharya Jayashankar : ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం..

by Sumithra |
Acharya Jayashankar : ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని కంఠేశ్వర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆచార్య జయశంకర్ తెలంగాణకు అందించిన సేవలను కొనియాడారు. అనేక వనరులు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆశించిన రీతిలో అభివృద్ధి సాధించకపోవడానికి గల కారణాలను, తెలంగాణాకు జరిగిన అన్యాయాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్టు వివరించడంలో జయశంకర్ కృతకృత్యులయ్యారని పేర్కొన్నారు.

తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని ప్రశంసించారు. 1969 లో జరిగిన తొలి విడత ఉద్యమంతో పాటు మలి విడత ఉద్యమంలోనూ ప్రజలను ప్రత్యేకించి విద్యార్థులు, యువతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ భాగస్వామ్యం చేశారని ఆయన గుర్తు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగించారని అన్నారు. ఆయన ఆశయం అయిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ, అంతకు ముందే ప్రొఫెసర్ జయశంకర్ స్వర్గస్థులు కావడం ఎంతో బాధ కలిగించిందన్నారు.

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలను చైతన్య పరుస్తూ అహర్నిషలు శ్రమించారని గుర్తు చేశారు. ఆయన సేవలను స్మరించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఆ మహనీయుడి ఆశయాల సాధనకు అన్ని వర్గాల వారు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు ప్రొఫెసర్ జయశంకర్ సేవలను శ్లాఘిస్తూ, జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed